రేపటిలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను చెప్పాల్సిందే… SBIకి సుప్రీం కోర్ట్ ఆదేశం
ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ వివరాలను వెల్లడించడానికి మరింత సమయం కావాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రేపటిలోగా ఆ వివరాలను భారత ఎన్నికల కమిషన్‌కు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు వివరాలను వెబ్‌సైట్‌లో ప్రచురించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రద్దు చేయబడిన ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ వివరాలను అందించడానికి మరింత సమయం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అభ్యర్థనను విన్న సుప్రీం కోర్టు ఈ రోజు బ్యాంకుకు కఠినమైన ప్రశ్నలను వేసింది. గత 26 రోజులుగా ఏం చేశారని మండిపడింది. SBI పొడిగింపు కోసం కోర్టును ఆశ్రయించింది. జూన్ 30 లోపు వివరాలను బహిర్గతం చేయడానికి అనుమతివ్వాలంది. కోర్టు ఫిబ్రవరి 15న ఒక ల్యాండ్‌మార్క్ తీర్పులో ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసింది. మార్చి 13 నాటికి విరాళం వివరాలను బహిర్గతం తెలియజేయాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

