అద్దాల మేడలో ఊరేగుతున్న అబద్దాల కాంగ్రెస్
తెలంగాణలో సాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. “అద్దాల మేడలో ఊరేగుతున్న అబద్దాల కాంగ్రెస్ మూలంగా రైతన్నలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు” అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో పండగలుగా మారిన వ్యవసాయం, కాంగ్రెస్ పాలనలో మళ్లీ దండగ అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గతంలో వచ్చిన నీళ్లు ఇప్పుడు కాలువల్లో ఎందుకు లేవో ప్రశ్నించిన కేటీఆర్, కాలం కాదు.. కాంగ్రెస్ కాటేస్తోందని, కరువు కాదు.. కాలువల్లో నీళ్లను అడ్డుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుమారు 600 మీటర్ల ఎత్తు నుంచి 450 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన కాళేశ్వరం నీళ్లు, గతంలో సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని రావిచెరువు వరకు చేరినట్టుగా గుర్తు చేశారు. కాని ప్రస్తుతం మేడిగడ్డ వద్ద మరమ్మతులు జరగకపోవడం, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోసే చర్యలు చేపట్టకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. విద్యుత్, సాగు నీటి పంపిణీ, కాలువల నిర్వహణపై ప్రభుత్వ అవగాహన లేకపోవడం వల్ల, నేరుగా రైతులు నష్టపోతున్నారని, ఇది విధ్వంసకర పాలనకు ప్రత్యక్ష ఉదాహరణ అని విమర్శించారు. సాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉండదని, రైతన్నల కోసం బలంగా పోరాటం చేస్తామని, కాంగ్రెస్ కుట్రలను చేధించడమే కాక, ప్రజల్లోకి నిజాలు తీసుకెళ్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

