Breaking NewsHome Page Sliderhome page sliderNewsPoliticsTelanganaviral

సీఎం క్షమాపణ చెప్పాలి

తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని అభ్యర్థుల ఫిర్యాదులపై విచారణ జరిపిన హైకోర్టు, జనరల్ మెరిట్ లిస్టు రద్దు చేస్తూ ఎనిమిది నెలల్లో రివాల్యూయేషన్ పూర్తి చేయాలని టీఎస్పీఎస్సికి ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువులో రీవాల్యూయేషన్ సాధ్యం కాకపోతే కొత్తగా గ్రూప్-1 పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హైకోర్టు తీర్పుపై హరీశ్ రావు స్పందించారు “హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు” అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆయన విమర్శించారు. తొందరపాటు నిర్ణయాలు, లోపభూయిష్టమైన మూల్యాంకనం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోతున్నారని అన్నారు. పరీక్షలు నిర్వహించడం అంటే చిల్లర రాజకీయాలు కాదు, అది యువత జీవితాలతో ముడిపడిన విషయం అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలి అని హరిశ్ రావు డిమాండ్ చేశారు.