Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

చిల్లరమాటల సీఎంకు పాలన చేతకాదు

కమీషన్లు వసూలు చేయడం, చిల్లర మాటలు మాట్లాడటం, పార్టీలు మారడం తప్ప సీఎం రేవంత్ రెడ్డి కి పరిపాలన చేతకాదని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఫార్మాసిటీ పేరుతో ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని హరీశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సిద్దిపేటలోని సీఎస్ఐ చర్చిలో గురువారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న హరీశ్ రావు క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గత కేసీఆర్ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించిందని, క్రిస్మస్ కిట్లు పంపిణీ చేయడంతో పాటు పండుగకు రెండు రోజుల సెలవులు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్మస్ కిట్లు ఎందుకు పంపిణీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణే లేదని, అలాంటి పోరాట యోధుడిని రేవంత్ రెడ్డి వీధి రౌడీలాగా దూషించడం సరికాదని హితవు పలికారు.
నాసార్‌పుర అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించిన హరీశ్ రావు, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలల్లో ఐదు నెలలుగా మెస్ బిల్లులు, కాస్మొటిక్ ఛార్జీలు పెండింగ్‌లో ఉండటంపై ఆయన మండిపడ్డారు. 20 శాతం కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకే నిధులు విడుదల చేస్తున్నారని, అనాథ పిల్లల అన్నానికి సంబంధించిన బిల్లులు మాత్రం చెల్లించడం లేదని ఆరోపించారు.