NewsTelangana

రాష్ట్రంలో మూడు భారీ ప్రాజెక్టులకు కేంద్రం ఓకే

తెలంగాణలో మరో మూడు సాగు నీటి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్ర జల్‌ శక్తి కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ అధ్యక్షతన ఢిల్లీలో భేటీ అయిన సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ).. భూపాలపల్లిలోని ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం, నిజామాబాద్‌లోని చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, అదిలాబాద్‌లోని చనకా-కొరాట ఆనకట్టకు ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను కేంద్ర జల సంఘానికి, గోదావరి రివర్‌ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం గతేడాది సెప్టెంబరులోనే సమర్పించింది. ఈ డీపీఆర్‌లకు కేంద్ర జలసంఘంలోని వివిధ డైరెక్టరేట్లు అప్పుడే ఆమోదముద్ర వేశాయి. టీఏసీ సమావేశంలో తెలంగాణ తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లు సి.మురళీధర్‌, ఎన్‌.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, మధుసూధన్‌, సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే పాల్గొన్నారు.