సుప్రీంకోర్టులో 5గురు న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం ఆమోదం
సుప్రీం కోర్టు జడ్జిల నియామకాలపై రగడ తీవ్రమవుతున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకొంది. నియామకాల ప్రక్రియపై ఎగ్జిక్యూటివ్, న్యాయవ్యవస్థ మధ్య సుదీర్ఘ గొడవల మధ్య సుప్రీం కోర్టుకు ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను కేంద్రం క్లియర్ చేసింది. అత్యున్నత న్యాయస్థానం నుండి కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొంటూ, ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తుల పదోన్నతి కోసం కొలీజియం సిఫార్సులను ఆదివారం నాటికి ప్రకటిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సంబంధించిన సిఫార్సులను క్లియర్ చేయడంలో జాప్యం జరగడంపై న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇది “చాలా తీవ్రమైన సమస్య” అని పేర్కొంది. ఈ విషయంలో ఏదైనా జాప్యం మంచిది కాదంది. రెండు పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల స్థితిని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని అడగగా… ఐదుగురు న్యాయమూర్తుల నియామకాలపై త్వరలోనే గెజిట్ జారీ అవుతుందని తెలిపారు.

