పసిగుడ్డుకు ఉరివేసి,ఆత్మహత్య చేసుకున్న కసాయి దంపతులు
మూడు నెలల చిన్నారికి ఉరివేసి చంపి, దంపతులు ఆత్మహత్య చేసుకున్నఅమానుష చర్య రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరపల్లిలో జరిగింది. దేవరపల్లికి చెందిన అశోక్, అంకితలకు మూడు నెలల పాప ఉంది. అశోక్ సోదరి నిశ్చితార్థానికి వెళ్లిన అంకిత పాపతో దేవరపల్లి వచ్చింది. అశోక్ తన తమ్ముడితో మార్కెట్‌కు వెళ్లి తెల్లవారుజామున తిరిగి వచ్చారు. అనంతరం అశోక్ టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టి పాప ఏడుపు వినిపించకుండా ఉరి వేశారు. తర్వాత వారిద్దరూ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. టీవీ శబ్ధం ఎక్కువగా ఉండడంతో పొరుగువారు తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లి చూడగా పాప, అంకిత మృతి చెంది ఉన్నారు. అశోక్ కొనఊపిరితో ఉరి వేసుకుని ఉండగా, కిందికి దించేలోపే మరణించినట్లు తెలిపారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

