పులి నోటి నుండి బిడ్డను కాపాడుకున్న ధీరమహిళ
“అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే” అంటారు పెద్దలు. ఇది అక్షరసత్యం. తాను చనిపోతానని తెలిసినా బిడ్డ బ్రతికితే చాలనుకుంది ఆ మాతృమూర్తి. తన 15 నెలల బుజ్జి కుమారుడిని రక్షించుకునేందుకు పులితోనే పోరాడింది ఆతల్లి. మధ్యప్రదేశ్‌లోని ఉమరియా జిల్లాలో రోహానియా గ్రామంలో భాంధవ్‌గడ్ పులుల అభయారణ్య ప్రాంతంలో జరిగిన సంఘటన ఇది.
25 ఏళ్ల అర్చనాచౌదరి, తన కుమారుడు రవిరాజ్‌ను తీసుకుని పొలానికి వెళ్లింది. దగ్గరలోని అభయారణ్యం నుండి వచ్చిన పులి చాటునుండి వచ్చి ఆబాలుడిని నోట కరుచుకుని వెళ్లబోయింది. ఈ హఠాత్పరిణామంతో ఆమెకు దిక్కుతోచలేదు. కుమారుని రక్షించుకొనేందుకు పులితోనే భీకర పోరాటం మొదలుపెట్టింది. ఎదురుగా పులి పంజా విసురుతున్నా లెక్కచేయలేదామె. బలంగా పంజా గాట్లు పడినా, తీవ్రగాయాలవుతున్నా, ధైర్యంగా పులికి ఎదురొడ్డి నిలిచింది. తన కుమారుడిని పులి నోట్లో నుండి రక్షించడమే ధ్యేయంగా పోరాడిన వీరమాతలా పోరాటం చేసి బిడ్డను రక్షించుకుంది. 25 నిముషాల పోరాటం అనంతరం గ్రామస్థులు రావడంతో పులి పారిపోయింది. గాయాలపాలైన అర్చనను, ఆమె కుమారుడిని మెరుగైన చికిత్స కోసం జబల్‌పూర్‌కు తరలించారు.