మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరు
రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ బలోపేతంపై ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ఎవరైనా బీజేపీకి మద్దతు ప్రకటించాలనుకుంటే వారిని సాదరంగా ఆహ్వానిస్తామని, అయితే ఎన్నికల్లో మాత్రం తాము ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు.
బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అసహనంతో మాట్లాడుతున్నారని రామచందర్‌రావు మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి గులాబీ పార్టీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు అద్భుత ఫలితాలు సాధించారని, అదే ఊపుతో మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎంపీలు వారి నివాసాల్లో సమావేశం కావడంలో ఎటువంటి తప్పు లేదని, తనకు వ్యతిరేకంగా భేటీ అయ్యారన్న వార్తలపై సరైన సమాచారం లేదని కొట్టిపారేశారు.

