కేరళలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
కేరళ రాజకీయాల్లో చారిత్రక మార్పు మొదలైందని, రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రిని పీఠంపై కూర్చోబెట్టడమే తమ అంతిమ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ప్రకటించారు. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, తిరువనంతపురంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు.తిరువనంతపురం కార్పొరేషన్‌లో గత 40 ఏళ్లుగా సాగుతున్న ఎల్డీఎఫ్ పాలనకు ముగింపు పలికిన ఓటర్లకు అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. “101 వార్డుల్లో 50 వార్డులను కైవసం చేసుకుని బీజేపీ అతిపెద్ద శక్తిగా అవతరించడం కేవలం ఒక మైలురాయి మాత్రమే. ఇక్కడి నుంచి కేరళ అసెంబ్లీ వైపు మా ప్రయాణం సాగుతుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం కనుమరుగవుతోందని, దేశంలో కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కోల్పోయిందని అమిత్ షా ఎద్దేవా చేశారు. కేరళలో కాంగ్రెస్ , కమ్యూనిస్టులు బయటకు విమర్శించుకున్నా, లోపల మాత్రం ‘మ్యాచ్ ఫిక్సింగ్’ చేసుకుంటున్నారని , వీరి అవినీతి, అపవిత్ర పొత్తుల వల్లే కేరళ అభివృద్ధి కుంటుపడిందని అమిత్ షా విమర్శించారు.
2047 నాటికి ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్న ‘వికసిత్ భారత్’ సాధనలో కేరళ అభివృద్ధి అత్యంత కీలకమని షా పేర్కొన్నారు. రాష్ట్ర భద్రతను, శతాబ్దాలుగా వస్తున్న ప్రజల విశ్వాసాలను కాపాడే సత్తా కేవలం ఎన్డీయేకే ఉందన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రతినిధులు ప్రజలకు వినయంతో సేవ చేయాలని, ప్రతి గడపకూ మోదీ సందేశాన్ని తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

