అమరావతిలో అతిపెద్ద ‘స్కాం’ చంద్రబాబు కరకట్ట నివాసమే
ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. అమరావతిలో అతిపెద్ద స్కాం కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసమే అన్నారు. అక్రమానికి చిరునామా అంటే బాబు నివాసమే అన్నారు. ఆ భవంతి లింగమనేని రమేష్ అనే వ్యక్తి పేరుతో ఉందని, ఒక దేశభక్తుడిగా అది ప్రభుత్వానికి ఇచ్చేశానని రమేష్ ప్రకటిస్తున్నాడని, కానీ చంద్రబాబు దానిని ప్రైవేట్ ప్రాపర్టీ అంటున్నారన్నారు. ప్రభుత్వ భవంతి అయితే చంద్రబాబు ఏ హోదాతో అక్కడ ఉంటున్నారన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా సీఆర్‌డీఏ చట్టం ద్వారా విలాసవంతుల నగరంగా అమరావతిని మార్చుదామని చంద్రబాబు అనుకున్నారని విమర్శించారు. ఆ ఇంటికి పైసా కూడా అద్దె కట్టకుండా ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు. అది అక్రమ కట్టమని భావించి ఆ భవనాన్ని ప్రభుత్వం అటాచ్ చేసిందన్నారు. ఆ భవంతికి అయిన రిపేర్లకు ప్రభుత్వనిధులు ఎలా ఖర్చు చేశారని మండిపడ్డారు.