సంచలన పరువు హత్య కేసులో నిందితులకు శిక్ష ఖరారు..
తెలుగు రాష్ట్రాలలో ఐదేళ్ల క్రితం సంచలనం కలిగించిన దళిత యువకుడు ప్రణయ్ పరువు హత్య కేసు నిందితులకు న్యాయస్థానం నేడు తుది తీర్పునిచ్చింది. ఈ కేసులో 8 మంది నిందితులకు కేసును విచారించిన నల్గొండ ఎస్సీ-ఎస్టీ కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించింది. వీరిలో ఏ-1గా ఉన్న అమృత తండ్రి మారుతిరావు ప్రాణాలతో లేరు. ఏ-2గా ఉన్న సుభాష్ అనే వ్యక్తికి ఉరిశిక్ష, ఇతరులకు జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రణయ్ అనే దళిత యువకుడిని తన కుమార్తె అమృత వివాహం చేసుకున్నదనే కారణంతో మారుతిరావు అనే వ్యక్తి 2018 సెప్టెంబర్ 14న సుపారీ ఇచ్చి మిర్యాలగూడలో కొందరు రౌడీలతో హత్య చేయించారు. అప్పట్లో ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో 8మందిపై కేసు నమోదయ్యింది. తర్వాత ఈ కేసు మీడియాలో బాగా సంచలనమయ్యింది. కేసు విచారణ కొనసాగుతుండగానే 2020లో హత్య చేయించిన మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు.

