‘అందుకే వైసీపీ ఘోర ఓటమి’… వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ పార్టీ ఘోర ఓటమిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూశారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను ఎలాగైనా గద్దె దించాలని కోరుకున్నారని, అందుకే వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలయ్యిందని పేర్కొన్నారు. ఇలాంటి ఎన్నికలు రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడూ జరగలేదని వర్ణించారు. ఎన్నికల ముందు జరిగిన సర్వేలలో కాంగ్రెస్ పార్టీకి 7 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. ఓటు వృథా కాకూడదన్న ఉద్దేశంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదని, కానీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ 2029లో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. తాను స్వయంగా 64 నియోజకవర్గాలలో పర్యటించానని, కడప లోక్‌సభ పరిధిలో కేవలం 14 రోజులు మాత్రమే ప్రచారం చేశానని పేర్కొన్నారు. కడప ప్రజలను వైసీపీ వర్గం వారు భయబ్రాంతులకు గురి చేశారని, వ్యతిరేక ఓట్లు పడితే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని భయపెట్టారని పేర్కొన్నారు. దీనితో కడప ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ఉన్నా వారి కోరికను చంపుకుని వైసీపీకి ఓట్లు వేశారని అభియోగాలు చేశారు. వైసీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటుకు రూ.3,500 చొప్పున పంపిణీ చేశారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఎన్డీయే సర్కారులో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకురావాలని పట్టుపట్టాలని తాను డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు.

