NationalNews Alert

ఆ తల్లి నిర్ణయం ఐదుగురికి ప్రాణదానం

కొన్ని దానాలు వెలకట్టలేనివి. వాటిలో అవయవదానాన్ని ముఖ్యంగా చెప్పుకోవాలి. ప్రమాదాల్లో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన వారి శరీరభాగాలను అవసరమున్న వేరొకరికి అమర్చే మహత్కార్యం నిజంగా ఎంతో గొప్ప విషయం. అయితే గుండెను తీస్తే బిడ్డ ప్రాణం పోతుందని తెలిసి కూడా  కుమారుడి హృదయాన్ని, ఇతర శరీరభాగాలను దానం చెయ్యడానికి అంగీకరించింది ఆ మాతృమూర్తి.

వివరాలల్లోకి వెళితే ఛండీగడ్‌లోని పీజీ మెడికల్ కాలేజీకి ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడిని తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించి, అతనిని బ్రెయిన్ డెడ్‌గా ధ్రువీకరించారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను బంధువుల అంగీకారంతో ఇతర రోగులకు అమరుస్తూ ఉంటారు. అలాగే అతని అవయవదానానికి అతని తల్లి అనుమతి అడుగగా ఆమె అంగీకరించింది. బాధితుని నుండి గుండె, కాలేయం, క్లోమం, కిడ్నీలను ఇతరులకు దానం చేశారు. గుండె మినహా ఇతర అవయవాలను అదే ఆస్పత్రిలో రోగులకు అమర్చారు.

గుండెను మాత్రం ఢిల్లీలోని ఆర్మీ హాస్పటల్ రీసెర్చ్ అండ్ రిఫరెల్ లో ఒక 54 ఏళ్ల సైనికుడు గుండె వైఫల్యంతో బాధపడుతుండగా, ఈ యువకుని గుండెను అతనికి అమర్చాలని వైద్యులు నిర్ణయించారు. ఈ విషయాన్ని నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్‌కు తెలియజేశారు. అనంతరం ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. సైనిక బలగాల్లోని ఆర్గాన్ రిట్రైవల్ అండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అథారిటీ, ఏహెచ్‌ఆర్‌ఆర్ వైద్యులు ఎయిర్ లిఫ్ట్ ద్వారా గుండెను సకాలంలో ఢిల్లీకి తరలించారు. ఆ సైనికునికి యువకుని గుండెను అమర్చి కొత్తఊపిరి పోశారు. ఆ తల్లి నిర్ణయం 5 మందికి కొత్తజీవితాన్నిచ్చింది.