‘అదంటే నాకు భయం’..సాయి పల్లవి
మంచి పద్దతి గల నటిగా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి ఇటీవల మీడియాతో కొన్ని విషయాలు పంచుకుంది. ‘ఫిదా’ చిత్రంలో అచ్చ తెలంగాణ అమ్మాయిలా అదరగొట్టిన సాయిపల్లవి తెలుగులో నటించిన చిత్రాలన్నీ దాదాపు సూపర్ హిట్ అనే చెప్పాలి. ఇటీవల శివకార్తికేయన్‌తో కలిసి నటించిన ‘అమరన్’ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు నాగ చైతన్యతో ‘తండేల్’ చిత్రంలో మరోమారు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. అయితే తనకు ఫోటోలు తీస్తే భయం అని మీడియాతో పేర్కొంది. కొందరు అడగకుండా ఫోటోలు తీసేస్తుంటారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన చుట్టూ చాలా మంది ఉన్నప్పుడు, అందరూ తననే చూస్తున్నప్పుడు కూడా తనకు భయంగా, బిడియంగా ఉంటుందని చెప్పింది. ఈ భయాలు తగ్గించుకోవడానికి ధ్యానం చేస్తుంటానని చెప్పుకొచ్చింది. తాజాగా బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో కలిసి, ‘రామాయణ్’ చిత్రంలో సీతగా నటిస్తోంది.