‘అది అటవీ భూమి కాదు’..రేవంత్ రెడ్డి
గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని, హెచ్సీయూకు సంబంధించినది కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ప్రజల్లో, ప్రతిపక్షాలలో ఏర్పడిన అపోహలను తొలగించాలని ఆయన మంత్రులను, ఉన్నతాధికారులను కోరారు. 2004లో హెచ్సీయూ నుండి 400 ఎకరాలు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఎంజీ అకాడమీస్ భారత్కు అప్పగించిందని, దీనికి బదులుగా గోపనపల్లిలోని 397 ఎకరాలు హెచ్సీయూకు బదిలీ చేసిందని అధికారులు తెలిపారు. అనంతరం 2006లో అప్పటి ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేయగా, ఐఎంజీ సంస్థ హైకోర్టుకు వెళ్లిందని, 2024లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని, ఇది హెచ్సీయూలో అంతర్భాగం కాదని పేర్కొన్నారు. ఇక్కడ భారీ పెట్టుబడులకు అవకాశం కల్పించడం వల్ల సుమారు 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు విద్యార్థులను ఉసిగొల్పుతున్నారని మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది ప్రభుత్వ భూమి అయినా దానిని అలాగే ఉంచాలని, అక్కడ పక్షులు, జంతువులు ఉన్నాయని పర్యావరణాన్ని సంరక్షించాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం నమోదయ్యింది.