ఉజ్జయిని మొహర్రం ఊరేగింపులో ఉద్రిక్తతలు…16 మందిపై కేసు నమోదు
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. జిల్లా అధికారులు ఊరేగింపునకు అనుమతించిన మార్గంలో కాకుండా, నిషేధించిన మార్గంలో ఊరేగింపు నిర్వహించేందుకు కొందరు ప్రయత్నించిన దరిమిలా గందరగోళం నెలకొంది. పోలీసులు అక్కడ గుమిగూడిన జనాన్ని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో.. ఊరేగింపు సమయంలో సింబాలిక్ గుర్రాన్ని తీసుకెళ్తున్నప్పుడు కొందరు బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో పోలీసులు అల్లరి మూకను చెదరగొట్టడానికి ప్రయత్నించారు. దీంతో ఇమామ్ హుస్సేన్ సమాధి ప్రతిరూపమైన తాజియాను మోస్తున్న వారితో సహా పలువురు గుర్రాన్ని సంఘటనా స్థలంలోనే వదిలి పారిపోయారు. ఈ ఘటన గురించి ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు ఒక నిర్వాహకునితో సహా 16 మందిపై కేసు నమోదు చేశామన్నారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో ఇతరులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.ఈ ఘటనకు మందు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో పోలీసుల అధికారిక అనుమతి లేకుండా మొహర్రం ఊరేగింపులో పాల్గొన్నారనే ఆరోపణలతో 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఊరేగింపు స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసిందని, స్థానిక వ్యాపారుల నుండి నిరసనలు వ్యక్తమయ్యాయని, స్వల్ప ఘర్షణకు దారితీసిందని పోలీసులు తెలిపారు. అయితే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు వెంటనే జోక్యం చేసుకున్నారు. వ్యాపారుల సమిష్టి ఫిర్యాదు ఆధారంగా ఊరేగింపు నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

