తిరుపతిలో ఉద్రిక్తత..వైసీపీ నేతలకు నోటీసులు
హిందువుల మహా పుణ్యక్షేత్రం రాజకీయాలతో వేడెక్కింది. లడ్డూ వ్యవహారంలోని పరస్పర ఆరోపణలతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎం జగన్ తిరుమలకు వస్తానని స్వామి దర్శనానికి వెళతానని చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే తిరుపతి పట్టణంలో సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమలులోకి తెచ్చారు. జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం అక్కడ ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదు. ఇప్పటికే అక్కడ పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలకు ముందస్తు నోటీసులు ఇచ్చారు. సభలు, సమావేశాలు నిర్వహణలను నిషేధించారు. వైసీపీ నేతలను హౌస్ అరెస్టు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టి ఆయనను తిరుమలకు వెళ్లరాదని అడ్డుకున్నట్లు సమాచారం. దీనితో వైసీపీ నేతలు గతంలో ఎన్నడూ ఇలాంటి సెక్షన్ 30 పోలీసు యాక్ట్ చూడలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మరోపక్క కూటమి నేతలు జగన్ అన్యమతస్తుడని, తిరుమలకు వెళ్లాలంటే ముందుగా అలిపిరి వద్ద డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

