NewsNews AlertTelangana

పాతబస్తీ.. పరేషాన్‌..!

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మహ్మద్‌ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు, ఆయనకు బెయిల్‌ లభించడంతో హైదరాబాద్‌లోని పాతబస్తీ అట్టుడుకుతోంది. చార్మినార్‌, మదీనా, చాంద్రాయణగుట్ట, బార్కస్‌, సిటీ కాలేజ్‌, గోషామహల్‌, డబీల్‌పుర, మొఘల్‌పుర, పత్తర్‌ఘట్టీ, భవానీనగర్‌ తదితర ప్రాంతాల్లో ఆందోళనకారులు అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. రాజాసింగ్‌ను మళ్లీ అరెస్టు చేయాల్సిందేనంటూ నల్లజెండాలతో ర్యాలీలు నిర్వహించారు. భవానీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌పై దాడికి వందలాది మంది ప్రయత్నించారు.

పోలీసు వాహనాలను ధ్వంసం చేస్తూ.. పోలీసులపై రాళ్లు రువ్వారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేస్తూ దుకాణాలు మూసేయాలని బలవంతం చేశారు. బేగంబజార్‌ ప్రధాన మార్గంలో బీభత్సం సృష్టించారు. శాలిబండ వద్ద ఆందోళనకారుల రాళ్ల దాడికి రెండు పోలీసు వాహనాల అద్దాలు పగిలిపోయాయి. ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై షాయినాయత్‌గంజ్‌, వనస్థలిపురం, అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి.

బెయిల్‌పై విడుదలైన రాజాసింగ్‌ ఇంటికెళ్తూ.. గోషామహల్‌ అలస్కా జంక్షన్‌ వద్ద విక్టరీ సింబల్‌ను చూపిస్తూ.. రెచ్చగొట్టేలా వ్యవహరించారని జావెద్‌ అలీ ఖురేషీ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని షాయినాయత్‌గంజ్‌ పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వ్యతిరేకంగా చార్మినార్‌, శాలిబండ, మదీనా తదితర ప్రాంతాల్లో వాల్‌ పోస్టర్లు వెలిశాయి. అనుచిత వ్యాఖ్యలతో రోడ్డు కూడళ్లలో పోస్టర్లను అంటించారు. రాజాసింగ్‌పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్‌కు రాసిన లేఖను మజ్లిస్‌ పార్టీ ఎమ్మెల్యే పాషాఖాద్రీ అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులుకు అందజేశారు.