ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా సీరిస్ విజయం
క్రికెట్‌లో గెలవాలంటే లక్ కూడా కలిసి రావాలి. టాలెంట్ తోపాటు, పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే విజయం సాధ్యమవుతుంది. బలమైన ఆస్ట్రేలియా జట్టుతో టీమ్ ఇండియా ట్వంట్వీ 20 సీరిస్‌లో విజేతగా నిలిచి ఔరా అన్పించుకుంది. మూడు మ్యాచ్‌లో సీరిస్‌లో 2-1తో విజయం సాధించింది. హైదరాబాద్‌లో జరిగిన మూడో మ్యాచ్ లో భారత్ జట్టు సత్తా చాటింది. మ్యాచ్‌కు ముందు రేగిన వివాదాలన్నింటినీ మాయమయ్యేలా భారత్ ఆటగాళ్లు ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్నారు.

క్షణక్షణానికి నువ్వా… నేనా అన్నట్టుగా సాగుతున్న మ్యాచ్‌లో భారత్ జట్టు 187 పరుగులు విజయ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఒక్కబాల్ మిగిలి ఉండగానే ఛేదించింది. సూర్యకుమార్ చెలరేగిపోవడంతోపాటు, కోహ్లీ దుమ్మురేపడంతో ఇండియా విజయం సాధ్యమయ్యింది. 187 పరుగుల విజయ లక్ష్యంతో మ్యాచ్ ప్రారంభించిన టీమ్ ఇండియా ఆటగాళ్లు మొదట తత్తరపడ్డారు. 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మ్యాచ్ ఆరంభంలో మొదటి 5 ఓవర్లను, 5గురు బౌలర్లతో వేయించి భారత్ పై ఒత్తిడి పెంచాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరన్ ఫించ్. అచ్చివచ్చిన ఉప్పల్ స్టేడియంలో ఇండియాకు విజయాన్ని అందించాలన్న కసిగా కోహ్లీ మ్యాచ్ ఆడితే సూర్యకుమార్ మాత్రం చెలరేగి ఆడాడు.


