మళ్లీ ఎన్డీఏలోకి టీడీపీ, హస్తినకు చంద్రబాబు!?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వస్తున్నారు. ఆయన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నింటినీ టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలు కంప్లీట్ చేశారని.. ఏపీలో పొత్తుకు సంబంధించిన క్లారిటీ కోసమే చంద్రబాబు ఢిల్లీ వస్తున్నారని తెలుస్తోంది. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని టీడీపీ భావిస్తోంది. అందులో భాగంగా జనసేనను పొత్తులో కలుపుకొంది. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ సర్కారు ఏర్పాటు చేస్తోందని జనసేనాని పవన్ కల్యాణ్ సైతం పదేపదే చెబుతున్నారు.

అయితే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే రెండు పార్టీల బలానికి కేంద్రంలో అధికారంలోకి ఉన్న బీజేపీ దన్ను కూడా కావాలన్న అభిప్రాయం అటు టీడీపీ-ఇటు జనసేనలోనూ బలంగా ఉంది. ఏపీలో బీజేపీకి ఒక పర్సెంట్ కంటే తక్కువ ఓట్లున్నాయని భావిస్తున్నప్పటికీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం.. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని తట్టుకొని ఎలక్షనీరింగ్ చేయడం ఈజీ కాదని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా బీజేపీతో కలిసి ఎన్నికల గోదాలోకి వెళ్లాలని ఆయన యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్‌డిఎ నుండి టీడీపీ వైదొలిగింది. అయితే గతం గతః అంటున్నారు రెండు పార్టీల నేతలు. ఇప్పుడు ఏపీలోని ప్రభుత్వాన్ని గద్దె దించడానికి తాము కలిసి పనిచేస్తామని నేతలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం, తిరిగి ఎన్‌డిఎ గూటికి రావడానికి, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేతులు కలపడానికే.. ఢిల్లీ వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గత జూన్‌లో చంద్రబాబు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశమయ్యారు. నాటి నుంచి బిజెపి నేతృత్వంలోని కూటమిలోకి టిడిపి తిరిగి చేరడం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి.

కర్నాటక ఎన్నికలలో ఓడిపోయిన తరువాత, కూటమి నుండి వైదొలిగిన మాజీ మిత్రపక్షాలైన JD(S), TDP, అకాలీదళ్‌లతో BJP తిరిగి చర్చలు ప్రారంభించినట్టు ప్రచారం జరిగింది. ఈ పార్టీల్లో జేడీ(ఎస్) తాజాగా బీజేపీతో జతకట్టింది. కానీ, వైసీపీ బలమైన ఎన్నికల శక్తిగా కనిపించే ఏపీ విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆంధ్రా సిఎం జగన్ మోహన్ రెడ్డిని దూరం చేయాలా వద్దా అనే విషయమై బీజేపీలో క్లారిటీ మిస్సవుతోంది. వైసీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నందున, బిజెపి మొత్తం వ్యవహారంపై నిర్ణయానికి రావడానికి సంకోచిస్తోంది. ఇటీవల చంద్రబాబు అరెస్టై జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఢిల్లీలో అమిత్ షాను కలిశారు. ఆ సమయంలో కూడా, బిజెపి నాయకత్వం ఏపీ విషయంలో ఏం చేయాలన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

