గెలుపే లక్ష్యంగా టీడీపీ అడుగులు
◆ ఎన్నికలకు సిద్ధమవుతున్న చంద్రబాబు
◆ వినూత్న కార్యక్రమాల ద్వారా వరుస పర్యటన
◆ క్యాడర్‌లో ఫుల్ జోష్
◆ వైసీపీని భూస్థాపితం చేస్తానని శపధం
ఏపీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకున్న అపారమైన రాజకీయ అనుభవంతో, ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ఊహగానాల నేపథ్యంలో ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల కార్యాచరణను మొదలు పెట్టి గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. వరుస పర్యటనలు చేస్తూ నిత్యం ప్రజలతో మమేకం అవుతూ శరవేగంగా ముందుకు వెళుతున్నారు. తనకు ఇవి చివరి ఎన్నికల కావని వైసీపీని భూస్థాపితం చేసే వరకు, రాష్ట్రాన్ని తిరిగి బాగు చేసే వరకు తాను ఉంటానని శపధం చేస్తున్నారు. తన జీవితంలో ఎందరో రాజకీయ నాయకులను చూశానని జగన్ వంటి నాయకుడిని ఎక్కడ చూడలేదని రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతుందని ప్రశ్నిస్తే తనపై దాడులు చేస్తున్నారని రాష్ట్రానికి జగన్ శనిల దాపరించాడని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ పాలక పక్షం పై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో చంద్రబాబు ఎన్నికల వ్యూహంలో భాగంగా తన వేగాన్ని మరింత పెంచారని విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న తరుణంలో ఆ పార్టీ క్యాడర్ కూడా మంచి ఉత్సాహంతో ఎన్నికల పోరుకు సిద్ధమవుతుంది.

ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర ఉన్నప్పటికీ చంద్రబాబు తన పొలిటికల్ ప్లాన్స్ ను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పార్టీ బలాన్ని పుంజుకునే విధంగా సమగ్ర కార్యాచరణతో సాగుతున్నారు. దీంతోపాటు ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలకు దిశా నిర్దేశాలు చేస్తూ పార్టీ కోసం సరిగ్గా పని చేయని నేతలకు సీరియస్ వార్నింగ్ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఏకాంత సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి పై పూర్తిస్థాయి రహస్య నివేదికలను తెప్పించుకుంటూ పార్టీ బలాబలాలను బేరీజు వేస్తున్నారు రానున్న ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకమైన నేపథ్యంలో నియోజకవర్గాల వారి గా పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి ఎక్కడైతే పార్టీ ఇంకా బలం పుంజుకోవాల్సిన అవసరం ఉందో అక్కడ నాయకులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ పక్కా ప్లాను అమలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. పనితీరు మెరుగుపరచుకొని నేతలపై తాను సేకరించిన నివేదికల ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని బలమైన నిర్ణయం తీసుకోబోతున్నారని విశ్వసనీయ సమాచారం.

డిసెంబర్ చివరి నాటికి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని 20 నియోజకవర్గాల్లో మార్పు చేర్పులకు చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెలాఖరులోగా టీడీపీ పోలీట్ బ్యూరో సమావేశం లో ముఖ్య నేతలతో భేటీ అయి కొన్ని కీలక నిర్ణయాలు చంద్రబాబు తీసుకుపోతున్నారట. పనితీరు సక్రమంగా లేని నేతలను చంద్రబాబు ఏమాత్రం ఉపేక్షించకుండా టికెట్ హామీని కూడా ఇవ్వకుండా పక్కన పెడుతున్నారని చంద్రబాబు మరింత స్పీడును పెంచి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. ఇప్పటికే బాధుడే బాధుడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో వివిధ పర్యటనలు చేసిన చంద్రబాబు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అంటూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లాల వారీగా పర్యటిస్తూ పాలకుపక్షంపై విమర్శనాస్త్రాలు చేస్తున్నారు. దీంతో చంద్రబాబు ఎన్నికల సమరానికి సమాయత్తమయ్యారని తనకున్న సుదీర్ఘ అనుభవంతో అధికార పీఠం కైవసం చేసుకునేందుకు అన్ని రకాల బాణాలను అధికారం పక్షంపై ఎక్కు పెట్టినట్లు విశ్లేషకులు అంటున్నారు.