ఏపీలో రోజుకు ఎవరో ఒకరు !
◆ టీడీపీ నేతల అరెస్టులపై విమర్శల వెల్లువ
◆ అధికార పార్టీకి పోలీసుల వత్తాసుపై ఆగ్రహం
◆ ప్రతిపక్ష నాయకులపై వరుస దాడులు
◆ జగన్ సర్కారు తీరు ఆక్షేపణీయమంటున్న విశ్లేషకులు
ఏపీలో అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు రోజురోజుకు మరింత రుజువవుతున్నాయి. ఇటీవలికాలంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, విచక్ష ణారహితంగా, విపక్ష టీడీపీ కార్యకర్తల మీదా, నాయకులు మీద దాడులు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. చూడ బోతే ప్రభుత్వ యం త్రాంగమే పోలీసులకు మద్దతునిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ అధికార ప్రేరేపిత పోలీసు రాజ్యంగా మార్చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయ్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న విమర్శ చేసినా ఒక వర్గం పోలీసులు సాధారణ ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అసమ్మతిని తెలియజేసే అమాయక ప్రజలను, నాయకులను అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు విన్పిస్తున్నాయి.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపిన ప్రతిపక్ష నాయకులను చట్టవిరుద్ధంగా గృహ నిర్బంధం చేస్తున్నారని.. తప్పుడు కేసులతో వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడుతున్నారు. అసమ్మతి వ్యక్తీకరణ అనేది భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులలో హామీ ఇవ్వబడిన వాక్ స్వేచ్ఛలో భాగం. ఇది ప్రజాస్వామ్య హక్కు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్య హక్కులు రెండూ పూర్తిగా ఉల్లంఘించబడుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రతిపక్ష నాయకులపై వరుస దాడులు… ప్రజా సమస్యలపై గొంతెత్తిన టీడీపీ నాయకులను రోజుకు ఒకరిని అర్ధరాత్రి వేళ భయభ్రాంతులకు గురిచేసి అరెస్టు వారెంట్లు చూపకుండానే వారిని అరెస్టు చేస్తూ రావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.

గతంలో టీడీపీ సీనియర్ నాయకులు కోల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పట్టాభి రామ్, చింతమనేని ప్రభాకర్ వంటి నేతలను అక్రమ అరెస్టులు చేసిన వైసీపీ ప్రభుత్వం తాజాగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును, ఆయన కుమారుడు రాజేష్ లను అర్ధరాత్రి వేళ అరెస్టు చేశారు. ఒక మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడిని ఇంత దుర్మార్గంగా అర్ధరాత్రి వేళ దొంగల్లా చొరబడి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు రోడ్డెక్కి రాస్తారోకోలు చేసి, నల్లజెండాలతో నిరసనలు తెలిపారు. నర్సీపట్నంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్ కూడా పాటించాయి. రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతీ రోజు హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఫలితంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరంతరం భయం, అభద్రతతో జీవిస్తున్నారన్న అపప్రధను ప్రభుత్వం మూటగట్టుకుంటోంది.

ప్రజలు ప్రభుత్వ అహంకారపూరిత అప్రజాస్వామిక చర్యలను గమనిస్తున్నారని.. గుర్తిస్తున్నారని… రాబోయే రోజుల్లో పోలీసుల ప్రస్తుత పనితీరు ఒక బ్లాక్ మార్క్‌గా నిలిచిపోతుందని విపక్షాలు మండిపడుతున్నాయి. కనీసం ఇకనైనా లా అండ్ ఆర్డర్ వైఫల్యాలను తెలుసుకోవాలని రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు. కనీసం ఇకనైనా పోలీసులు ప్రతిపక్ష టీడీపీ నాయకులను వేధించడం మాని రాష్ట్రంలో నేరాల రేటును నియంత్రించడంపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

