పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు వర్మ తలనొప్పి
పిఠాపురం నుంచి ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించి, అసెంబ్లీలోకి ప్రవేశించాలని భావిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్‌కు కొత్త తలనొప్పిగా మారారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎస్ వర్మ. పిఠాపురంలో జనసేన కార్యకర్తలతో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి వెళ్లాలనుకుంటున్నానని, మొదటి రాష్ట్రానికి సేవ చేసి, ఆ తర్వాత దేశానికి సేవ చేయాలనుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ చెప్పారు. ఒక వేళ తనను లోక్ సభకు పోటీ చేయాలని ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా కోరితే, అప్పుడు తాను కాకినాడ పార్లమెంట్ నుంచి బరిలో నిలుస్తానన్నారు. అదే సమయంలో ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం నుంచి బరిలో దిగుతానన్నారు.

అయితే ఈ వ్యాఖ్యలు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఆయుధంలా మారాయి. పార్టీ హైకమాండ్ ఆదేశాలతో తాను పవన్ కల్యాణ్ కోసం ఎన్నికల్లో పనిచేయాలనుకున్నానని.. ఒకవేళ పవన్ కల్యాణ్ కాకినాడ ఎంపీగా బరిలో దిగితే.. తాను పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయమని ఆయన చెప్పారు. చంద్రబాబు ఆదేశాలతో తాను సీటును పవన్ కల్యాణ్ కోసం వదులుకున్నానని.. వేరెవరైనా పోటీ చేస్తే.. తాను తప్పకుండా బరిలో నిలుస్తానన్నారు. మొత్తంగా తన దృష్టంతా పిఠాపురంపైనే ఉందని చెప్పకనే చెప్పారు. ఓవైపు జనసేనానికి మద్దతంటూనే నియోజకవర్గంలో టీడీపీ నేతల్లో హుషారు పెంచుతున్నారు వర్మ. తన వర్గాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే పిఠాపురంలో హోరాహోరీ తప్పదని భావిస్తున్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచేలా పవన్ కల్యాణ్ కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సమయంలో గతంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన వర్మ ఇప్పుడు జనసేనానికి కొత్త తలనొప్పులు కలిగిస్తున్నారు. అసలు వర్మ మనసులో ఏముందోనని జనసైనికులు ఆందోళనకు గురవుతున్నారు. ఓవైపు అధికార వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కల్యాణ్‌ను ఓడించాలని ప్రణాళికలు రూపొందించుకుంటుంటే, కూటమి నుంచి తలనొప్పి రావడం.. వచ్చే రోజుల్లో రాజకీయం ఎలా ఉంటుందన్నదానిపై ఆసక్తి కలిగిస్తోంది.