Andhra PradeshHome Page Slider

కాళ్లు పట్టించుకున్న టీడీపీ నేత, జనసేన సీరియస్…!?

ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో నేతల మధ్య సుహృద్భావం వెల్లువిరుస్తోంది. ఎంత మంచి రిలేషన్ అయినా పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం ఆధారంగానే ముందుకు సాగుతుంది. లేదంటే తేడా కొడుతుంది. అది స్నేహమైనా అంతే, పొత్తు అయినా అంతే… నాడు అధికారం కోసం రెండు పార్టీల నేతలు అహర్నిశలు కష్టపడ్డారు. దీంతో కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు కార్యకర్తల మధ్య మాత్రం ఢిష్యుం, ఢిష్యుం సాగుతోంది. కృష్ణా జిల్లాలో కూటమి కార్యకర్తల మధ్య గొడవ రచ్చ రచ్చకు కారణమవుతుంది. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జరిగినప్పటికీ వెలుగులోకి కొన్ని మాత్రమే వస్తున్నట్టు తెలుస్తోంది. వాటిలో మచిలీపట్నం కేంద్రంగా జరిగిన వ్యవహారం ఇప్పుడు కూటమిపై ప్రభావం చూపెడుతోంది. వినాయకచవితి సందర్భంగా కట్టిన బ్యానర్ ఇప్పుడు టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య గొడవకు కారణమైంది. తాము కట్టిన బ్యానర్ చించినందుకు జనసేన నేతలను చితక బాదారు టీడీపీ నేతలు. మచిలీపట్నం పరాసుపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పరాసుపేటలో వినాయకచవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు. తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ బ్యానర్ జనసేన నేతలు యర్రంశెట్టి నాని, శ్రీనివాసరావు బ్యానర్ చించేశారు. బ్యానర్ చించేసిన యర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడికి దిగారు. దాడిలో యర్రంశెట్టి నానికి గాయాలయ్యాయి. రక్తం కారేలా కొట్టడంతో జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతే కాదు ఇంటిని కూడా ధ్వంసం చేశారు. ఇక గొడవ పెద్దది కావడంతో పెద్దలు, ఇరు వర్గాల మధ్య సెటిల్మెంట్ చేశారు. సెటిల్మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి యర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడికి దిగారు. అక్కడే ఉన్న శాయన శ్రీనిసరావును రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు. బ్యానర్ చించినందుకు కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్నారు స్థానిక టీడీపీ నేతలు. టీడీపీ నేత శంఖు శ్రీను కాళ్లు పట్టుకుని జనసేన నేతలు యర్రంశెట్టి నాని , శాయన శ్రీనివాసరావు క్షమాపణ చెప్పారు.

మరోవైపు ఘటన తీవ్రమవడంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు రగిలిపోతున్నారు. గత ఎన్నికల్లో తమ వల్లే టీడీపీ గెలిచిందని, ఇప్పుడు తమపై దాడులకు తెగబడటమేంటని వారు వాపోతున్నారు. త్వరలోనే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని నేతలు భావిస్తున్నారు. ఇలాగే చూస్తూ ఊరుకుంటే వచ్చే రోజుల్లో దాడులు మరింతగా జరిగే అవకాశముందని, అనవసరంగా టీడీపీ నేతలు తమపై దాడికి తెగబడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇలా వదిలేస్తే వచ్చే రోజుల్లో పరిస్థితి మరింత ముదురుతుందని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు జనసేన, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు చిలకలపూడి స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.