రేవంత్ నాయకత్వానికి మునుగోడు పరీక్ష
కలిసుంటే నిలబడతాం.. విడిపోతే పడిపోతాం. . ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ప్రియాంక చేసిన హితబోధ. ఐక్యతతో అడుగులు వేస్తేనే మునుగోడు సాధిస్తాం. తిరిగి మన సీటును మనం గెలుచుకుంటాం. ఇదే కాంగ్రెస్ ముఖ్య నేతలకు ప్రియాంక బోధించిన హితం. ఇక దూకుడు పెంచండి .. క్రమశిక్షణతో ముందుకు వెళ్ళండి.. అంటూ వెన్నుతట్టు ఉరికించే ప్రయత్నాలు చేశారు. కానీ హైకమాండ్ భేటీలో కూడా అనైక్యత స్పష్టంగా కనిపించింది. పైకి నవ్వులు .. లోపల పొగలు కక్కే సెగలు. అంతా కలిసే ఉన్నాం.. కలిస్తే నడుస్తాం అని చెబుతున్నా.. ఎవరి గోల వారిదిగా కనిపిస్తోంది. ప్రియాంకాతో భేటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టి.. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ మనుగడ సాధించాలంటే పీసీసీని ప్రక్షాళన చేయాల్సిందేనంటూ తన డిమాండ్ ను పునరుద్ఘాటించారు. ఇక ఇలా అయితే లాభం లేదనుకున్నారో ఏమో .. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలన్ని నిశితంగా పరిశీలిస్తానంటున్నారు ప్రియాంక.

మునుగోడులో భేరీలు మోగాయి. ప్రజా దీవెనలయ్యాయి. అందరికంటే ముందుగా బీజేపీ ప్రచారాన్ని కూడా షురూ చేసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే మునుగోడు ఓటర్లను కలిసే పనిలో బిజీ అయ్యారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్ధులెవరో ఇంకా ఖరారు కాలేదు. ఇంకా ఆ పార్టీలు కసరత్తు చేస్తూనే ఉన్నాయి. ఆశావహులు ఎక్కువవుతున్నారు. అసంతృప్తులు ఎక్కువగానే ఉన్నాయి. ఆచితూచి అడుగులు వేసి.. అభ్యర్ధులను ఖరారు చేసేందుకు రెండు పార్టీలు తలమునకలవుతున్నాయి. పార్టీని గట్టెక్కించాలంటే కలిసి పని చేయాలి. కలిసి పని చేయాలంటే అందరూ కదలి రావాలి. కానీ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ప్రచారానికి కూడా హాజరు కాబోనని తేల్చి చెప్పేశారు. దీంతో మునుగోడు వ్యవహారం కాంగ్రెస్ కు కొరుకుడు పడ్డం లేదు. పైకి అంతా ఓకేలా కనిపిస్తోంది. కానీ.. లోలోపల ఉడికి పోతోంది. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టాక ఎక్కడా విజయం అన్న మాటే కాంగ్రెస్ శిబిరంలో వినిపించడం లేదు. ఉన్న నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. ఇదే ఇప్పుడు సీనియర్లు హైలెట్ చేసి హైకమాండ్ ముందు పెడుతున్నారు.

గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. హుజూరాబాద్ లో కేవలం మూడే వేల ఓట్లతో మూడోస్ధానంలో నిలిచింది. ఇక దుబ్బాకలో కూడా మూడో స్ధానమే లభించినా ఓట్ల పరంగా పరువు నిలువుకుంది. నాగార్జున సాగర్ లో జానారెడ్డి ప్రాభవం వల్ల రెండవ స్ధానంలో నిలిచి గట్టి పోటీ ఇచ్చింది. అప్పటి పరిస్ధితులు వేరు. కానీ.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వేరు. పార్టీలో సీనియర్లను రేవంత్ రెడ్డి అవమానకరంగా చూస్తున్నరన్నది ప్రధాన ఆరోపణ. కార్యకర్తలతో తిట్టించి క్షమాపణలు చెబుతున్నారని కోమటి రెడ్డి విమర్శిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడేం చేయాలి.. ఎలా గట్టెక్కాలి.. ఎలా అందరినీ కలుపుకు పోవాలి.. సిట్టింగ్ సీటును ఎలా నిలుపుకోవాలి.. హైకమాండ్ దగ్గర పరువు కాపాడుకోవాలంటే మునుగోడులో గెలిచి తీరాలి. ఈ ప్రశ్నలు రేవంత్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొద్దిగా దిగొచ్చి సంయమనం పాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ.. కాంగ్రెస్ అంటే ఏముందిలే.. పెద్ద పదవి అందరూ కలిసి వస్తారులే అనుకున్న ఆలోచనను మార్చుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. నిజంగా ఈ ఎన్నిక రేవంత్ నాయకత్వానికి అగ్ని పరీక్షే. కాంగ్రెస్ గెలిచిందా ఓకే.. లేకపోతే పీసీసీ పదవి గోవిందా అనక తప్పదన్న భయం రేవంత్ ను వెంటాడుతోంది.

తెలంగాణ రాజకీయ పరిణామాలు .. మునుగోడు పరిస్ధితులపైనే ఏఐసీసీ ఇప్పుడు దృష్టి పెట్టింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక అయితే చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్గత విబేధాలను పక్కన పెట్టాలంటూ .. ఓ దశలో సీరియస్ గానే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన ముఖ్య నేతలందరితో చర్చించాకే అభ్యర్ధిని ప్రకటించేందుకు కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించకపోతే ఇటు రేవంత్, అటు మాణిక్కం ఠాగూర్ పదవులు ఊడడం ఖాయంగా కనిపిస్తోందని కాంగ్రెస్ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. దీనికి తోడు మర్రి శశిధర్ రెడ్డితో పాటు మరికొంత మంది సీనియర్లు కూడా రేవత్ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఇవన్నీ ఎక్కడ వికటించి పదవికి ఎసరు పెడతాయోనని రేవంత్.. మాణిక్యం కంగారు పడుతున్నారు. చూద్దాం.. మునుగోడులో కాంగ్రెస్ ఏం చేయబోతోందో.. ఓటర్లు ఆ పార్టీకి ఎలా జవాబు చెప్పబోతున్నారో.


