విడాకుల విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు
ఇక మీదట విడాకులు తీసుకోవాలంటే ఆ దంపతులు ఆరునెలలు వేచి చూడాల్సిన అవసరం లేదని కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. భార్యాభర్తలిద్దరు కోరుకుంటే వెంటనే విడాకులు మంజూరు చేయొచ్చని ఆదేశాలు జారీ చేసింది. కలిసి ఉండే అవకాశం లేనప్పుడు విడిపోవడమే మంచిదని వ్యాఖ్యానించింది. దీనితో విడాకుల ప్రక్రియ సులభతరం కానుంది. ఆరునెలలు కలిసి ఉండాలనే తప్పనిసరి నిబంధన వల్ల చాలామంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గృహహింస, మానసిక వ్యధలకు సంబంధించిన సమస్యలతో మహిళలు కలిసి ఉండి తీవ్ర ఇబ్బందులకు లోనుకావడం,ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడడం వంటి చర్యలు అడపాదడపా జరుగుతున్నాయి. దీనితో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు వల్ల కలిసి ఉండడం ఏమాత్రం ఇష్టంలేని, కష్టమైన దంపతులు త్వరితగతిన విడాకులు తీసుకునే అవకాశం ఏర్పడింది.