Breaking Newshome page sliderHome Page SliderNewsPoliticsTelanganaviral

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఉపశమనం లభించింది. బీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

జస్టిస్ విక్రమ్‌నాథ్‌, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. ఇప్పటికే ఇదే అంశంపై తెలంగాణ హైకోర్టులో రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్దార్థ దవే, అభిషేక్ సింఘ్వీ, ఎడీ.ఎన్‌. రావు సమర్పించారు. హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారు? అని ధర్మాసనం పిటిషనర్‌ న్యాయవాదిని ప్రశ్నించింది.

ఆర్టికల్‌ 32 కింద రిట్‌ పిటిషన్‌ ఎందుకు దాఖలు చేశారని సుప్రీంకోర్టు స్పష్టంగా ప్రశ్నించగా, హైకోర్టు స్టే ఇవ్వలేదని పిటిషనర్‌ న్యాయవాది వాదించారు. దీనిపై ధర్మాసనం “హైకోర్టు స్టే ఇవ్వకపోతే, నేరుగా సుప్రీంకోర్టుకు వస్తారా?” అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. అనంతరం పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ తీర్పు వెలువరించింది.

ఈ విచారణకు తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్వయంగా హాజరయ్యారు.

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్‌–9ను సవాలు చేస్తూ వంగ గోపాల్‌ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగి, సుప్రీంకోర్టు పిటిషన్‌ను తిరస్కరించడంతో తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్లయ్యింది.