సుప్రీం కోర్టు తీర్పుతో ఆప్ ప్రభుత్వానికి ఊరట
సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధాని ఢిల్లిలో పాలన వ్యవహారాలపై నియంత్రణ అధికారం ఎవరికీ ఉండాలనే వివాదంలో ఆప్ ప్రభుత్వానికి ఊరట లభించింది. స్థానికంగా ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికే ఢిల్లీ పాలనా వ్యవహారాల్లో అసలైన అధికారాలు ఉండాలని సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. డిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవన్న గత తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రభుత్వాధికారులపై స్థానిక ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. ప్రజల అభీష్టం ప్రతిబింబించేలా చట్టం చేసే అధికారాలు ఢిల్లీ అసెంబ్లీకి ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అధికారులు.. మంత్రులకు నివేదించడం ఆపివేస్తే లేదా వారి ఆదేశాలకు కట్టుబడి ఉండకపోతే, సమష్టి బాధ్యత సూత్రం ప్రభావితమవుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. శాంతి భద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై ఢిల్లీ సర్కార్‌కే నియంత్రణ ఉండాలని సుప్రీం తేల్చిచెప్పింది.

