ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది న్యాయస్థానం. చాలా ప్రాంతాలలో ఏక్యూఐ 400 పాయింట్లు దాటిందని, అత్యవసరంగా కఠిన చర్యలు అమలు చేయాలని వ్యాఖ్యానించింది. ఢిల్లీ ప్రభుత్వంతో పాటు, కేంద్ర ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్‌ను కూడా సుప్రీంకోర్టు మందలించింది. గాలి నాణ్యత సివియర్ ప్లస్ కేటగిరీకి చేరిందని, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని మండిపడింది. నిబంధనలు కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ స్టేజ్ 4 నిబంధనలు అమలు చేయాలని పేర్కొంది.
ఇప్పటికే ఢిల్లీలో ట్రక్కులను నిషేధించారు. ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉద్యోగులలో 50శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఆదేశించారు. 10,12 తరగతులు మినహా మిగిలిన విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. నేటి ఉదయం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 481గా నమోదయ్యింది.

