Home Page SliderNational

హథ్రాస్ ఘటనపై సుప్రీం చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు

హథ్రాస్ తొక్కిసలాటపై సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై దాఖలైన పిటిషన్‌ను లిస్టింగ్ చేయవలసిందిగా సుప్రీంకోర్టును ఆదేశించారు. ఈ ఘటనలో 121మంది మరణించగా, ఎంతోమంది గాయాలపాలయ్యారు. ఈ తొక్కిసలాట ఘటనపై అడ్వకేట్ విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. పబ్లిక్ మీటింగులకు సంబంధించిన కొన్ని రూల్స్, గైడ్‌లైన్స్ తప్పకుండా ఉండేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో నియమించాలని, ఈ ఘటనపై ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. తనను తాను భోలే బాబా ప్రకటించుకునే నారాయణ సర్కార్ హరి ఏర్పాటు చేసిన ఈ సత్సంగ్‌కు మొదట 80 వేల మందికి అనుమతి తీసుకోగా, రెండున్నర లక్షలమంది హాజరయ్యారు. ప్రవచనం పూర్తయ్యాక, ఆయన వెళుతుండగా పాదధూళి కోసం జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రజలు మరణించారు. రాష్ట్రప్రభుత్వాలు ఇలాంటి మీటింగులకు కొన్ని గైడ్‌లైన్స్ రూపొందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిర్వాహకులు ఈ తొక్కిసలాటలకు బాధ్యత వహించాలని, ఇలాంటి పెద్దఎత్తున జరిగే మీటింగుల సందర్భంగా మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.