సూపర్ సిక్స్ ఒక ఫ్లాప్ షో: తులసి రెడ్డి
- 14 నెలల్లో ఒకే ఒక హామీ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం
- నిరుద్యోగ భృతి లేదు
- 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వట్లేదు
- ఆడబిడ్డ నిధి లేదు
- తల్లికి వందనం పథకంలో కోతలు
- కొంతమందికే చేరువైన అన్నదాత సుఖీభవ
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్లు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాదని అది ఒక ఫ్లాప్ షోగా తయారయ్యిందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఇన్నాళ్లకి సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసిందని పేర్కొన్నారు .సూ పర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పడంలో వాస్తవం లేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటిపోయింది . కానీఇప్పటికి కూడా సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన హామీ యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు 3000 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీ ఇంతవరకు అమలు కాలేదు. 3000 రూపాయలు కాదు కదా మూడు రూపాయలు కూడా ఇవ్వలేదు. ఆ విధంగా నిరుద్యోగ యువతను కూటమి నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని కూటమి తన మేనిఫెస్టోలో చెప్పి,14 నెలలు అయింది . ఇప్పటివరకు అతిగతి లేదు . ఆ విధంగా ఎస్సీ ,ఎస్టీ, బీసీ ,ముస్లిం మైనార్టీలను కూటమి ప్రభుత్వం మోసగించింది. ఆడబిడ్డ నిధి కింద 19 –59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు ,ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని కూటమి తన ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ లో చెప్పింది 14 నెలలు దాటిపోయింది. ఇంతవరకు పైసా ఆర్థిక సహాయం చేయలేదు .ఆ విధంగా ఆడబిడ్డలను నమ్మించి మోసగించింది కూటమి ప్రభుత్వం.
తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15000 రూపాయలు ఇస్తామని చెప్పి అందులో 2000 రూపాయలు కోత కోసి కేవలం 13 వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా 2024–25 విద్యా సంవత్సరానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు .ఆ విధంగా తల్లికి వందనానికి కోత విధించింది. రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా అనేక కోతలు .రాష్ట్రంలో 76 లక్షల మంది రైతులు ఉంటే అందులో 46 లక్షల 86 వేల మందికి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం అమలు అవుతోంది. ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం 20000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో , సూపర్ సిక్స్ హామీలలో చెప్పి ప్రస్తుతం 6000 కోత కోసి 14 వేల రూపాయలు మాత్రమే ఇస్తా అంటుంది . అందులో కూడా 2024– 25 ఆర్థిక సంవత్సరానికి పైసా కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి కోతలు విధించడం జరిగింది. కాబట్టి. అది పాక్షికంగా మాత్రమే అమలవుతోందని అన్నారు.

