ఆకాశంలో వింత దృశ్యాలు -కదిలే నక్షత్రాలు
ఆకాశంలో జరిగే వింతలంటే అందరికీ కుతూహలమే. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ, ఫరూఖాబాద్‌తో పాటు పలు ప్రాంతాలలో ఆకాశంలో వింత వెలుగులు దర్శనమిచ్చాయి. వరుసగా నక్షత్రాలు కదిలివెళ్తునట్లు కనిపించిన ఆవెలుగులను చూసి ప్రజలు ఆశ్చర్యానికి, కాస్త భయానికి కూడా లోనయ్యారు. రైలు డబ్బాల ఆకారంలో పొడుగ్గా ఉన్న వాటిని చూసి అవాక్కయారు. ఏదైనా అద్భుతం జరుగుతోందా అని చర్చించుకున్నారు. సినిమాలలో చూపించినట్లు ఏవైనా గ్రహాంతర వాసుల వాహనాలా అని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం అవన్నీ అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ పంపిన ఉపగ్రహాలు అయి ఉంటాయని అంటున్నారు. ఈ సంస్థ ఇటీవలే 51 ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. ఫ్లోరిడా తీరం నుంచి వాటిని ప్రయోగించింది. భూమ్మీద మారుమూల ప్రాంతాలకు కూడా బ్రాడ్ బ్యాండ్ సేవలను విస్తరించాలనే ఉద్దేశంతో చేపట్టిన స్టార్‌లింక్ ప్రాజెక్టు కోసం అనేక ఉపగ్రహాలను ఈ స్పేస్ ఎక్స్ నింగిలోకి ప్రయోగిస్తోంది. అయితే ఈ విషయం ఇంకా నిర్థారింపబడలేదు.
ఈ దృశ్యాలను ఇప్పటికే చాలామంది ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాలలో పోస్టులు చేశారు.

