జపాన్‌లో వింత చట్టం..ప్రతిపక్షాల విమర్శలు
జపాన్‌లో యమగట రాష్ట్రప్రభుత్వం రోజుకొక్కసారైనా అందరూ నవ్వాలంటూ వింత చట్టం చేసింది. ఇది ప్రజల ఆరోగ్యానికి చాలా మంచిదని సూచించింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నాయి. యమగట ప్రిఫెక్చర్ స్థానిక ప్రభుత్వం ప్రతిరోజూ అందరూ నవ్వుతూ ఉండాలని రూల్ పెట్టింది. ఇది ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఎంతగానో ప్రభావం చూపుతుందని ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రతీ నెలా 8వ తేదీన హాస్యంతో ఆరోగ్యం అంటూ ప్రత్యేకదినాన్ని జరుపుకోవాలని కోరింది. అక్కడ విశ్వవిద్యాలయంలోని ఫాకల్టీ ఆఫ్ మెడిసిన్ చేసిన పరిశోధనలను అనుసరించి ఈ చట్టం చేసినట్లు తెలిపారు. వారు ఆరోగ్యం, మనిషి జీవితకాలం, ఆనందం అనే అంశాలపై పరిశోధనలు చేయగా, తక్కువ నవ్వేవారిలో మరణాలు ముప్పు పెరుగుతున్నట్లు గుర్తించారు. అయితే ఈ చట్టాన్ని ప్రత్యర్థి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. నవ్వడం, నవ్వకపోవడం ప్రజల వ్యక్తిగత విషయమని పేర్కొంది. వ్యక్తిగత కారణాలు, సమస్యల దృష్ట్యా అందరూ నవ్వలేకపోవచ్చని జపాన్ కమ్యూనిస్టు పార్టీ అభిప్రాయపడింది. ప్రజల హక్కులను కాలరాయొద్దని మండిపడింది. అయితే ఇది కేవలం ఆర్డినెన్స్ మాత్రమేనని, అది పాటించపోయినా జరిమానాలు, శిక్షలు ఉండవని ప్రభుత్వంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తేల్చి చెప్పింది.