విశాఖలో వందే భారత్ ఎక్స్ ప్రెస్‌పై రాళ్లదాడి
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ మధ్య నడిచే వందేభారత్ రైలు చెన్నైలోని కోచ్ ఫాక్టరీ నుండి విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఈ రైలుపై రాళ్లదాడికి పాల్పడ్డారు కొందరు ఆకతాయిలు. ఈ రైలును నిర్వహణ కోసం కంచరపాలెం వద్ద ఉన్న న్యూకోచింగ్ కాంప్లెక్సుకు తరలించగా, అక్కడ ఆడుకుంటున్న బాలురు రాళ్లు విసిరినట్లు గుర్తించారు. ఈ దెబ్బకు ఒక కోచ్ అద్దం పగిలిపోయింది. మరొక అద్దం పూర్తిగా ధ్వంసమైంది. రైల్వే పోలీసులు బాధ్యులను గుర్తించే పనిలో పడ్డారు.

కాగా ఈరైలు బుధవారం ఉదయం విశాఖ చేరుకోగా,దానిని చూసేందుకు ప్రయాణీకులు చాలా ఉత్సాహం చూపించారు. అత్యాధునికంగా, అందంగా కనిపిస్తూ అందర్నీ ఆకర్షించింది వందేభారత్ ఎక్స్ ప్రెస్. దీనిలో 16 కోచ్‌లు ఉన్నాయి. ఒక్కొక్క కోచ్ పొడవు 23 మీటర్లు ఉంది. స్లైడింగ్ డోర్లు, ఆటోమెటిక్ ఎగ్జిట్, ఎంట్రీ డోర్లు, సీసీ కెమెరాలు, పుష్‌బాక్ చైర్లు, రీడింగ్ లైట్స్,బయోవాక్యూమ్ టాయ్‌లెట్స్, అటెండెంట్ కాల్ బటన్లు కలిగి ఉంది. ఈ రైలు విశాఖపట్నం, సికింద్రాబాద్‌ల మధ్య నడపబడుతుంది. ఫస్ట్ క్లాస్ కోచ్‌లు రెండు ఉన్నాయి. సీటింగ్ కెపాసిటీ 52 మంది. మొత్తం రైలులో 1,128 మంది ప్రయాణం చేయవచ్చు.