శ్రీవారి ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ ఇకలేరు..
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఆదివారం తుది శ్వాస విడిచారు. 76 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో ఆయన మరణించారు. 1978 నుంచి 2006 వరకూ టీటీడీ ఆస్థాన గాయకుడిగా పని చేసిన గరిమెళ్ల.. అన్నమాచార్య రచనల్లోని వెయ్యికి పైగా సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. 2006 నుంచి ఆయన తిరుపతి స్వగృహంలోనే ఉంటున్నారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ 21 వ శతాబ్దపు వాగ్గేయకారులలో ఒకరిగా చెప్పవచ్చు. ఇప్పటివరకు 800లకు పైచిలుకు అన్నమయ్య కీర్తనలు స్వరపరిచారు. 400 పైగా కృతులను తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400 పైగా లలిత గీతాలు రచించారు. 16 నవంబర్ 2012 లో టి.టి.డి ఆస్థాన గాయకులుగా నియమించబడ్డారు. కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకులుగా కూడా పనిచేసి శ్రీ కామాక్షి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం పొందారు. ‘కీర్తనలు అన్నమయ్యవి – స్వరం బాలకృష్ణ ప్రసాద్‌ది అంటుంటారు ఆయన అభిమానులు. తన జీవితమంతా వేంకటేశ్వరుడి సేవలోనే గడిచిపోయింది అని, టి.టి.డి వారిచ్చిన ఆస్థాన విద్వాన్ అనే బిరుదు తనకెంతో అపురూపమైనది అని ఆయన ఒక సందర్భంలో పేర్కొన్నారు.

