ప్రతీ రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయాలు
టీటీడీ ఆధ్వర్యంలో ప్రతీ రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తిరుపతిలో జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో’ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో శ్రీవారి మందిరాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. ‘మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది అతి కీలకమైన పాత్ర. ఆలయాల అభివృద్ధి వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఆలయ పర్యాటకం మనదేశంలో రూ.6 లక్షల కోట్ల ఎకానమీతో ప్రముఖ పాత్ర కలిగి ఉంది. 1983లో తిరుమలలో ఎన్టీఆర్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఆ అన్నదాన ట్రస్టుకు రూ.2 వేల కోట్ల నిధి ఉంది. తిరుమలో 75 శాతం హరితమయమే. క్యూఆర్‌కోడ్స్, డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా తిరుమలలో ఎక్కడా అపచారాలు, తప్పులు జరగకుండా పర్యవేక్షిస్తున్నామని’ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు.