మరికాసేపట్లో తెలంగాణాలో వర్షాలు
తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఏపీని ముంచెత్తిన ఈ వానలు ఈ రోజు తెలంగాణాని కూడా మరోసారి పలకరించనున్నాయి. రాబోయే 3 గంటల్లో తెలంగాణాలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. హైదరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్,మహబూబ్‌నగర్,నాగర్ కర్నూల్,నారాయణ్‌పేట్,సంగారెడ్డి,వరంగల్,భద్రాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనేపథ్యంలో గంటకు 41-61 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్రంలోని ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది.