Home Page SliderNational

లోక్‌సభకు సోనియా గుడ్ బై… ముగిసిన ప్రత్యక్షరాజకీయ పోరాటం


కాంగ్రెస్ పార్టీలో కొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. సోనియా గాంధీ రాజ్యసభకు ఎందుకు వెళ్లారు? నాడు ఇందిరా నేడు సోనియా రాజ్యసభకు వెళ్లడానికి దారి తీసిన పరిస్థితులేంటి? సోనియాగాంధీ ఎందుకు ప్రత్యక్ష రాజకీయాలను వదులుకున్నారు 1999 నుంచి సోనియా గాంధీ లోక్ సభకు ఎన్నికవుతూ వచ్చారు. తాజాగా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనరాదని నిర్ణయించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మార్గదర్శనం చేసిన సోనియా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ చైర్‌పర్సన్‌గా తిరుగులేని అధికారాన్ని అనుభవించారు.


మొన్న కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న సోనియా గాంధీ, ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి సైతం వైదొలగాలని నిర్ణయించుకున్నారు. సోనియా గాంధీ లోక్ సభ సభ్యురాలుగా పాతికేళ్లు పూర్తి చేశారు. ఇది ఒక ఎంపీగా చాలా పెద్ద కాలం. ప్రత్యర్థుల నుంచి విదేశీయురాలంటూ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో ఆమె రాజకీయాలు కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ అయోమయం, గందరగోళంగా ఉన్న సమయంలో నేతృత్వం వహించి పార్టీని గాడిన పెట్టారు. 77 ఏళ్ల సోనియా గాంధీ మొత్తంగా, ఇక తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇకపై తన గళాన్ని రాజ్యసభ నుంచి సోనియా విన్పిస్తారు. సోనియా రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని గత కొంత కాలంగా ప్రచారం జరిగినప్పటికీ ఆమె ఇప్పుడప్పుడే ఆ పని చేసే అవకాశం లేదని తాజాగా రుజవయ్యింది. తాను రాజకీయాల్లో కొనసాగుతానని పార్టీ కార్యకర్తలకు, నేతలకు సోనియా బదులిచ్చారు. తాజాగా సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి ఇవాళ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. గతంలో రాజస్థాన్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వం వహించారు. ఐతే ఆయన అనారోగ్యం దృష్ట్యా ప్రస్తుతం రాజకీయాలకు దూరం జరిగారు.


సోనియా గాంధీ, గాంధీ కుటుంబానికి అచ్చివచ్చిన అమేథి నుంచి తొలుత విజయం సాధించగా… ఆమె కర్నాటక బళ్లారి నుంచి కూడా పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించారు. 1999లో సోనియాగాంధీ రాజకీయ అరంగేట్రం పార్టీకి ఊపిరిపోసింది. కష్టకాలం నుంచి గట్టెక్కేలా చేసింది. రాజీవ్ గాంధీ హత్య జరిగిన ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆమె పార్టీని రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను భుజాన ఎత్తుకున్నారు. 2004లో సోనియా గాంధీ పార్టీకి కంచుకోట అయిన రాయ్‌బరేలి నుంచి బరిలోకి దిగారు. నాటి నుంచి నేటి వరకు ఆమె అక్కడ్నుంచి ఎంపీగా విజయం సాధిస్తూ వచ్చారు. 1999 నుంచి పార్లమెంట్‌లో పార్టీ వాయిస్ బలంగా విన్పించారు సోనియా గాంధీ. సోనియా గాంధీ పార్లమెంట్‌లో కీలక డిబేట్‌లలో పాల్గొని, పార్టీ వాయిస్ బలంగా విన్పించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలోనూ సోనియా, ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. ఎంపీల సస్పెన్షన్ పైన సోనియా గళం విప్పారు. 2018లో సోనియా గాంధీ చేసిన ప్రసంగం నేటికి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ లెక్చర్లు చాలా బాగా ఇస్తారని… కానీ అవి కడుపు నింపవని ఆమె వ్యాఖ్యానించారు. అందరికీ దాల్, చావల్ కావాలని, మాయ మాటలు ఆకలి తీర్చవని తీవ్రస్థాయిలో విమర్శించారు.

2015లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల్లో అనేక ఫేక్ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని తీవ్రస్థాయిలో సోనియాగాంధీ విమర్శించారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ నియామకం విషయంలోనూ ప్రభుత్వాన్ని సోనియా తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీని ఎంతగా బలోపేతం చేసినప్పటికీ ఆమె విదేశీయురాలన్న వర్షన్ మొదట శరద్ పవార్ లేవనత్తగా ఆ తర్వాత బీజేపీ విమర్శలుగుప్పించింది. ఈసారి సోనియా గాంధీ స్థానంలో ఎవరు రాయ్‌బరేలి నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే సోనియా స్థానంలో ప్రియాంక బరిలో దిగుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. 2019 ఎన్నికల్లో పార్టీ కంచుకోట అయిన అమేథిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. కేరళ వాయనాడ్ నుంచి ఆయన లోక్ సభకు ఎన్నికయ్యారు. రాహుల్ గాంధీ కేరళ నుంచి తిరిగి పోటీ చేస్తారా లేదంటే అమేథీ నుంచి మళ్లీ పోటీ చేస్తారా అన్నది తేలాలి. ఓవైపు ప్రియాంక, మరోవైపు రాహుల్ యూపీలో పోటీకి దిగి… ఎస్పీతో పొత్తు ద్వారా బీజేపీని కట్టడి చేసేందుకు ప్రయత్నించవచ్చు.