100 చిత్రాల పాటల రచయిత..విషాదాంతం..
100 సినిమాలకు పైగా పాటలు రాసిన సినీ పాటల రచయిత కులశేఖర్ జీవితం విషాదంగా ముగిసింది. మతి స్థిమితం కోల్పోయి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కులశేఖర్ ఒక సినీ పాటల రచయిత. దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ దగ్గర అనేక చిత్రాలకు పాటలు రాశాడు. ‘చిత్రం’, ’10th క్లాస్’, ‘ఘర్షణ’, ‘వసంతం’, ‘నువ్వునేను’ వంటి విజయవంతమైన చిత్రాలకు ఆయన పాటలు రాశారు. 2013లో కాకినాడలో ఆలయంలో శఠగోపం దొంగతనం, హైదరాబాద్ ఆలయంలో బ్యాగు దొంగతనం కేసులలో అరెస్టయ్యారు. హైదరాబాదులో ఉన్న అతని స్నేహితులు ఇచ్చిన సమాచారం ప్రకారం సుమారు 2008 లో అతను మెదడుకు సంబంధించిన వ్యాధి బారిన పడి జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. అతని భార్య ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను పోషిస్తున్నట్లు సమాచారం. చివరికి దిక్కు లేకుండా గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఆయన మృతదేహం లభించడంతో ఆయన మరణం విషయం వెలుగులోకి వచ్చింది.