Andhra PradeshHome Page SliderNews Alert

సోమేపల్లి సాంబయ్య…సకల జన బాంధవుడు!

కిసాన్ సెల్‌ అనే పదం వినగానే పాత, కొత్తతరం నాయకులు, రైతులకు ఠక్కువ గుర్తొచ్చే ఏకైక వ్యక్తి దివంగత మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు సోమేపల్లి సాంబయ్య. సకల జనుల సమస్యలను గుర్తించి సత్వరమే పరిష్కరించడానికి ఏ పక్షం నాయకునితోనైనా కలసి ముందుకు సాగడమే నాయకత్వమంటూ రాజకీయానికే సరికొత్త భాష్యం చెప్పివ రాజనీతిజ్ఞులు ఆయన. రాజకీయాన్ని వృత్తిగా స్వీకరించి, దైవకార్యంగా భావించి తాను నమ్మిన సిద్ధాంతాన్ని అన్నదాతలకు,తాను అనుభవించే జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయాలని సంకల్పించి కార్యదీక్షలో దక్షతతో ప్రజా విజయాలను నమోదు చేసిన ధీరోదాత్తులు, దార్శనికులు సోమేపల్లి. మూడు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర శాసన సభకు ఎన్నికైనా పోతూ పోతూ అన్నదాతల అభిమానాన్ని, పేదల విశ్వాసాన్ని, సామాన్యుల ప్రేమానురాగాల్ని తప్ప ఆస్తులను కూడబెట్టని పరశురాముడాయన. నేడు 25వ వర్ధంతి జరుపుకుంటున్న రాష్ట్ర ఎత్తిపోతల సితామహులు సోమేపల్లి సాంబయ్యపై ManaSarkar ప్రత్యేక కథనం .

రైతుజన బాంధవునిగా, ఎత్తిపోతల పథకం రాష్ట్ర పితామహునిగా ఖ్యాతిగాంచిన దివంగత మాజీ శాసనసభ్యులు సోమేపల్లి సాంబయ్య. నేడు 25వ వర్ధంతిని జరుపుకుంటున్నారు. చిలకలూరిపేట నియోజక వర్గ అన్నదాతల ఆశాదీపం ఆరిపోయి నేటికి సరిగ్గా 25. సంవత్సరాలు పూర్తికావస్తుంది. అయినా ఆయన జ్ఞాపకాలు, అకుంఠిత దీక్షతో ఆయన సాధించి ,అందించిన సేవలు…. సామాన్యులు, పేదల మెదళ్ళలో మెదులుతూనే ఉన్నాయి. వ్యవసాయాన్నే ఊపిరిగా, అన్నదాతల సంక్షేమమే ఉచ్వాస‌, నిచ్వాస‌లుగా భావించి తుదిశ్వాస వరకు రైతుల పక్షాన ఏకపక్షంగా పోరాడిన ఉద్యమ తరంగం ఆయన. అతివృష్టి, అనావృష్టి సమయాలలో సర్వం కోల్పోతున్న అన్నదాతలను ఆదుకొనేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా చిలకలూరిపేట ప్రాంతంలో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయించి నేర్వేరు పార్టీల ముఖ్యమంత్రుల చేత శభాష్ అనిపించుకున్న సోమేపల్లి నేడు ఈ ప్రాంతంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఆరుగాలం పాటు నీరందించే ఎత్తిపోతల పథకాలను ప్రారంభించడానికి ఆదర్శనీయులే కాదు ప్రధాన కారకులయ్యారు కూడా! రైతులకు వెన్నుదన్నుగా పాలకులకు స్పూర్తిగా నిలిచిన ఆయన ఆలోచనలు రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధికే తలమానికం, కొలమానం. జీవితాన్ని కార్మికులు, శ్రామికులు, కర్షకుల సంక్షేమం కోసం ధార‌పోసి ఆయా వర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని ప్రయాణం సాగించిన నిత్యపోరాట శీలి ఆయన. ఇటువంటి ఆయన పేరిట గత కాంగ్రెస్ పాలకులు ఒక్క రైతు సంక్షేమ పథకానికి కూడా ఆయన పేరును పెట్టలేకపోయారు.

రాజకీయ జీవితం

ఆంగ్ల ప్రొఫెసర్ గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతగా పొలం పనులు నిర్వహించుకొనేవారు. 1967లో చిలకలూరిపేట మండలంలోని తాతపూడి గ్రామానికి జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అనంతరం అదే గ్రామ కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షునిగా పనిచేసారు. ఆ సమయంలోనే అన్నదాతలకు ఏదైనా సాయంచేయాలని, అది ప్రభుత్వం తరుపునే అందాలనే కృతనిశ్చయంతో దీర్ఘకాలిక రాజకీయాల్లోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే ప్రాంతీయ రైతు సమస్యలను జిల్లా, రాష్ట్ర నాయకులు, పాలకుల దృష్టికి తీసుకువెళ్ళారాయన. కిసాన్ కిసాన్ సెల్ రాష్ట్ర కన్వీన‌ర్‌, రోస్టల్ డవలెన్మెంట్ సభ్యునిగా ఆయకట్టు చివరి భూములకు నీరందించే కమిటి సభ్యునిగా వ్యవహరించిన ఆయన.. ఆ సమయంలోనే రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు ప్రారంభించి రైతులకు దీర్ఘకాలం పాటు నీరందించే ప్రతిపాదనలకు శ్రీకారం చుట్టారు. అదే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకెళ్ళారు.

1978లో కాంగ్రెస్ పార్టీ తరుపున తొలిసారిగా చిలకలూరిపేట ముండి శాసనసభకు ఎన్నికయ్యారు. జనతాపార్టీకి చెందిన భీమిరెడ్డి సుబ్బారెడ్డిపై 20% ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా వ్యవహరించిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి భవనం వెంకట రామిరెడ్డి చొరవతో రాష్ట్రంలోని మొత్తం ఎత్తిపోతల పథకాల నిర్మాణాల‌కు రూ. 2కోట్లు మంజూరు చేయించారు. వాటిల్లో రూ.70లక్షలను యోజకవర్గంలోని లోని గోపాలంవారిపాలెం పథకానికి కేటాయించేలా కృష‌ఙ చేశారు సోమేప‌ల్లి సాంబ‌య్య‌. అంటే రాష్ట్ర వ్యాప్త ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు జ‌రిపిన‌ మొత్తం కేటాయింపుల్లో దాదాపు 40% నిధులను ఈ ప్రాంతంలో వ్యవసాయరంగ అభివృద్ధికి కేటాయించేలా చొర‌వ తీసుకున్నారంటే.. రైతులన్నా, వ్యవసాయమన్నా ఆయనకు ఎంత మక్కువ ఎక్కువో అర్ధం చేసుకోవచ్చు. 1983లో ఎన్టీఆర్ సునామీలో భాగంగా తాను అపజయం పాలైనా తిరిగి రెండేళ్ళకే 1985లో రెండవసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు. టీడిపి అభ్యర్థి మానం వెంకటేశ్వర్లుపై ఘ‌న‌విజయం సాదించారు. ఆ మధ్యకాలంలో మరికొన్ని ఎత్తిపోతల పథకాల ఏర్పాటుతో పాటు సాగర్ కాల్వలను నియోజక వర్గానికి రప్పించడం, తాగు, సాగునీరు సమస్యల పరిష్కారానికి చొరవ చూపేందుకు విశేషంగా కృషి చేశారు. 1989-94 మధ్యకాలంలో గోపాలంవారిపాలెంలో ఏర్పాటైన ఎత్తిపోతల పథకానికి రెండవ విడతలో భాగంగా ఆధునీకరణ, విస్తరణ పనులను ప్రారంభించారు. ఈ ప్రాంతంలో సాగర్ కాల్వలు నిర్మితమైతే పొగాకు పంట, పరిశ్రమలకు విఘాతం ఏర్పడుతుందని అప్పట్లో ఎంతో మంది ప్రారిశ్రామిక వేత్తలు మోకాలడ్డినా భగీరధునిలా ప్రయత్నించి సాగర్ కాల్వలను చిలకలూరిపేట నియోజకవర్గానికి రప్పించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు సోమేప‌ల్లి.

ఎమ్మెల్యే కార్యాలయానికి ఆద్యులు

రాజకీయాల్లో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణతో పాటు గెలుపోటములను జీర్ణించుకునే నాయకులు జీవించినా, మరణించినా ప్రజల హృదయాలలో చిరకాలం నిలిచిపోతారు. అటువంటి వారిలో సోమేపల్లి సాంబయ్య అగ్రగణ్యులు. 1978, 1985, 1994లో శాసనసభకు ఎన్నికైనా, 1983, 1989, 1999లలో పరాజయం పాలైనా ఆయన రైతుబాందవునిగానే గుర్తించబడ్డారు. అశేష అభిమానుల ఆదరణను చూరగొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలను పక్కన పెట్టి అప్పటి కమ్యూనిష్టు నాయకులు కొల్లా వెంకయ్యతో కలిసి పనిచేశారు. అదే విధంగా కరణం నరశింగారావుతోనూ ప్రజల సంక్షేమం కోసం పనిచేశారు. నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేకంటూ సొంత కార్యాలయం ఏర్పడిందంటే అది ఆయన చొరవే. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే కార్యాలయాన్ని నిర్మించి, ప్రారంభించారు. సామాన్యులను సైతం ప్రజా ప్రతినిధులుగా ఎదిగేందుకు వెన్నుద‌న్నుగా నిలిచారు సాంబయ్య, అప్పటి సమితి ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కందిమళ్ళ బుచ్చయ్యపై కట్టా సుబ్బారావు అనే వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టి అఖండ విజయం సాధింపజేశారు. రాజకీయాల్లో గెలుపోటములతో పాటు ఎన్నో ఎత్తుపల్లాలను అనుభవించిన ఆయన పదవులను తృణప్రాయంగా భావించి కర్తవ్యాన్నే పురస్కారంగా, పదవులుగా భావించి రైతుల పక్షాన పోరాడారు. ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న కాలంలోనే చిలకలూరిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యానికి ప్రతినిత్యం వచ్చి శ్రేణులతో సంభాషించి సమస్యలు పరిష్కరించి తిరిగి సొంత గ్రామం తాతపూడికి వెళ్ళి దైనందిత ప‌నులు చూసుకునేవారు. ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారని ఏమాత్రం భేషజాలకు పోకుండా ఆయన సతీమణి సుశీల సైతం సొంతగా వ్యవసాయపనుల్లో నిమగ్నమై ప‌దిమందికీ ఆదర్శంగా నిలిచేవారు. జీవితాంతం ఆయన రైతుల కోసం ఆయన ఏ స్థాయిలో శ్రమించారంటే.. కొందరు ముఖ్యమంత్రులైతే అన్నదాతల సమస్యలను సోమేపల్లి సాంబయ్య ఏకరవు పెట్టినప్పుడల్లా …ఏంట‌య్యా, ఎప్పుడూ రైతులూ రైతులూ అని ఇబ్బంది పెడతావు? వాళ్ళవల్ల నీకు ఏ ప్రయోజనమూ ఉండదు. ముంద‌ది తెలుసుకో అని సున్నితంగా విసుకున్న ముఖ్యమంత్రులూ ఉన్నారంటే సాంబ‌య్య‌ రైతు దీక్షాద్యతలు ఎలాంటివో అర్ధం చేసుకోవచ్చు. అటువంటి మహనీయులు నియోజకవర్గ రైతుల్లోనే కాదు… ఉమ్మడి రాష్ట్ర రైతులంతా ఎత్తిపోతల పథకాల ప‌ట్ల‌ మనుగడ కొనసాగించినంతవరకు వారి గుండెల్లో అమరజీవిగా నిలిచే ఉంటారు సోమేప‌ల్లి సాంబ‌య్య‌.