కొంత మంది క్రికెటర్లపై వేటు…కొంత మందికి ఊరట
దేశవాళీ క్రికెట్ ఆడనందున టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను బీసీసీఐ గతేడాది సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. అయితే ఇటీవల కాలంలో శ్రేయస్ దేశీయ టోర్నీలు, అంతర్జాతీయ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 243 రన్స్ బాది భారత్ తరఫున ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో శ్రేయస్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ మళ్లీ పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది.ఏ ఆటగాడు అయినా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోకి రావాలంటే ఒక నిర్దిష్ట క్యాలెండర్ ఇయర్లో మూడు టెస్టులు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడాలి. శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ లో 11 మ్యాచ్‌లు ఆడాడు. కాబట్టి సెంట్రల్ కాంట్రాక్ట్‌లో అతడ్ని తీసుకోవచ్చని తెలుస్తోంది. అయితే టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వంటివారు అంగీకారం తెలిపితేనే శ్రేయస్‌కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కే అవకాశం ఉంది.
భారత మహిళల జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్‌లను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో టీమ్ ఇండియా పురుషుల జట్టు కేంద్ర కాంట్రాక్ట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఏ+ కేటగిరీలో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. దీంతో వారి సెంట్రల్ కాంటాక్ట్ కేటగిరీ కేటాయింపులపై బీసీసీఐ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బుమ్రాను A+ కేటగిరీలో కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.