Breaking NewscrimeHome Page SliderPoliticsTelangana

సామాజికవేత్త దారుణ హ‌త్య‌

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన దారుణ హత్య తెలంగాణలో సంచలనంగా మారింది. సామాజికవేత్త రాజలింగమూర్తిని కొందరు దుండగులు కత్తులతో దాడిచేసి అత్యంత విచక్షణారహితంగా చంపారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అవినీతి జరిగిందని గత కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు రాజలింగమూర్తి. దీంతోపాటు ఆయన అనేక ప్రజా పోరాటాలలో ముందు వరుసలో ఉంటారు. ఆయన హత్య రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది.రాజలింగమూర్తి హత్య బుధవారం రాత్రి భూపాలపల్లిలో నడిరోడ్డుపై జరిగింది. రాజలింగమూర్తి బైక్ పై తన సొంతూరు జంగేడు వెళ్లి వస్తుండగా వెంటాడిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మార్గమధ్యలో దాడి చేశారు. కత్తులు, గొడ్డళ్లతో దారుణంగా నరికి హత్య చేశారు. అంతా చూస్తుండగానే విచక్షణ రహితంగా పొడిచి చంపారు. ఆ తర్వాత దుండగులు పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యకు రాజకీయ వివాదాలే కారణమా. వ్యక్తికత కక్షలు కారణమా అనేదానిపై విచారణ జరుపుతున్నారు.ఇదిలాఉంటే.. భూపాలపల్లిలో రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్‌ సెంటర్‌లో ధర్నాకు దిగారు రాజలింగమూర్తి భార్య నాగవల్లి.. , తన భర్తను చంపింది రేణిగుంట్ల కొమురమ్మ, సంజీవ్‌ అంటూ ఆరోపించారు. హంతకులను పట్టుకునేవరకు అంత్యక్రియలు చేయబోమని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. కాగా.. రాజలింగమూర్తి హత్యకు భూవివాదమే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..