బద్రీనాథ్‌లో భారీగా విరిగిపడ్డ మంచు చరియలు.. పలువురు గల్లంతు
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంచు కురవడంతో మంచు చరియలు విరిగిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో పలువురు చిక్కుకున్నారు. అక్కడి ధామ్‌లోని హైవేపై మంచు చరియలు విరిగిపడడంతో అక్కడ రోడ్డు నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న 57 మంది చిక్కుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న బీఆర్‌ఓ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 10 మందిని రక్షించి క్యాంప్‌కు తరలించినట్లు తెలిపారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆ ప్రదేశంలో అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. మంచు భారీగా కురవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.