Home Page SliderInternationalNews Alert

అమెరికాలో మంచు తుఫాను.. 38 మంది మృతి…

క్రిస్మస్‌ వేళ అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. తుఫాను ప్రభావంతో 38 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా విపరీతంగా కురుస్తున్న మంచుతోపాటు చలిగాలులకు అమెరికా, కెనడా దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. న్యూయార్క్‌ బఫెలో నగరం అత్యంత ప్రభావిత ప్రాంతంగా మారింది. కెనడాలోని బ్రిటీష్‌ కొలంబియా రాష్ట్రానికి చెందిన మెరిట్‌ పట్టణానికి సమీపంలో మంచుతో నిండిన రహదారిపై బస్సు బోల్తా పడడంతో నలుగురు మరణించారు. గత కొద్దిరోజులుగా తీవ్రంగా ఉన్న చలి, మంచు కారణంగా విద్యుత్‌ సంక్షోభం కూడా ఏర్పడింది. అయితే.. ఇప్పుడిప్పుడే విద్యుత్‌ పునరుద్ధరిస్తున్నారు. అమెరికాలో 2 లక్షల మంది విద్యుత్‌ లేక ఇబ్బందులు పడ్డారు. మంచు తీవ్రత కారణంగా వేలాది విమానాలను రద్దు చేశారు. క్రిస్మస్‌ వేడుకలకు చాలా మంది ఇళ్లకు చేరుకోలేకపోయారు.

బాంబు సైక్లోన్‌గా చెబుతున్న ఈ శీతాకాలపు తుఫాను- వాతావరణంలో పీడనం తగ్గడం వల్ల ఏర్పడుతుంది. దీని కారణంగా భారీ మంచు కురవడంతోపాటు, చలి గాలులు వీస్తాయి. ఈ బాంబ్‌ సైక్లోన్‌ కారణంగా అమెరికా వ్యాప్తంగా తీవ్ర అంతరాయం కలిగింది. ఇండ్ల పై కప్పులు కూడా కనిపించని స్థాయిలో అక్కడ ఉధృతంగా మంచు కురుస్తోంది. వాహనాలు కూడా మంచురాశుల నడుమ కూరుకుపోయాయి. దీంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచాయి. జనజీవనం స్తంభించింది. అంబులెన్సులు కూడా నడిచే పరిస్థితి లేకుండా పోయింది. రోడ్లపై పేరుకుపోయిన మంచు రాశులను తొలగించే చర్యలను సంబంధిత ప్రభుత్వ విభాగాలు చేపట్టాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యపరమైన జాగ్రత చర్యలు తీసుకోవాలంటూ న్యూయార్క్‌ రాష్ట్ర గవర్నర్‌ క్యాథీ హోచుల్‌ ట్వీట్‌ చేశారు.