InternationalNews Alert

ధూమపానం వల్లే క్యాన్సర్ మరణాలు అధికం : ది లాన్సెట్

ప్రపంచ దేశాలను క్యాన్సర్ భూతం భయపెడుతూనే ఉంది. ఏటా లక్షల సంఖ్యలో క్యాన్సర్‌ బాధితులు చనిపోతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ధూమపానం, మద్యపానం,అధికబరువు కలిగి ఉండడం వంటివి క్యాన్సర్‌ మరణానికి ప్రధాన ముప్పుగా మారినట్లు తాజా అధ్యయనం వెల్లడించించాయి. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న క్యాన్సర్‌ మరణాల్లో దాదాపు సగం ఈ కారణాల వల్లే చోటుచేసుకుంటున్నాయని పేర్కొంది. క్యాన్సర్ కారక మరణాలపై చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూసినట్టు ప్రముఖ జర్నల్ ‘ది లాన్సెట్‌’ వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ బాధితుల్లో మరణాలకు దారితీస్తున్న ప్రధాన కారణాలను విశ్లేషించేందుకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఈ సందర్భంగా ధూమపానం, మద్యం సేవించడం, అధిక బరువు కలిగి ఉండడం వంటివి క్యాన్సర్‌ మరణాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయని గుర్తించారు. వీటివల్లే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 44.5లక్షల మంది బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. అంటే అన్ని దేశాల్లో చోటుచేసుకుంటున్న క్యాన్సర్‌ మరణాల్లో దాదాపు 44.4శాతం ఈ మూడు కారణాల వల్లే చనిపోతున్నారని వెల్లడించారు.

‘2019లో దాదాపు 28.8లక్షల మంది క్యాన్సర్‌ సోకిన పురుషులు ,16 లక్షల మంది మహిళలు ఈ ప్రమాదకరమైన అలవాట్ల వల్లే ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా శ్వాసకోస క్యాన్సర్‌ బాధితుల్లోనే ఈ మరణాలు అధికంగా ఉన్నాయి. పురుషులు, మహిళలు మరణాలకు ప్రధాన కారణం ధూమపానమే. దాదాపు 36.9శాతం బాధితులు ఈ ఒక్క ప్రమాదపు అలవాటు వల్లే చనిపోతున్నారు. క్యాన్సర్‌ మహమ్మారి ప్రజారోగ్యానికి భారీ సవాలు విసురుతోందని తమ అధ్యయనం ద్వారా స్పష్టమైందని పరిశోధనకర్త, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవొల్యూషన్‌ (ఐహెచ్‌ఎంఈ) డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ ముర్రే పేర్కొన్నారు

మరోవైపు మహిళల్లో ప్రధానంగా గర్భాశయం (17.9శాతం), పెద్ద పేగు (15.8శాతం), రొమ్ము (11శాతం) క్యాన్సర్‌లు అధికంగా సంభవిస్తున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. పురుషుల్లో మాత్రం ఎక్కువగా శ్వాసనాళం, ఊపిరితిత్తులు (36.90) పెద్ద పేగు (13.30) , అన్నవాహిక (16.30), జీర్ణాశయ క్యాన్సర్లు వెలుగు చూస్తున్నట్లు తెలిపింది.