BusinessHome Page SliderTelanganatelangana,

తెలంగాణ హౌసింగ్ బోర్డుకు సుప్రీంలో షాక్..

హైదరాబాద్‌లోని కొన్ని ప్రాజెక్టులలో కొనుగోలుదారులు 20 ఏళ్లుగా చేస్తున్న న్యాయపోరాటానికి తెరదించింది సుప్రీంకోర్టు. రాంకీ, మంజీరా, ఇందూ ప్రాజెక్టులలో ఫ్లాట్స్‌ కొనుగోలు చేసిన వారికి 4 వారాలలో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిందేనని హౌసింగ్ బోర్డుకు సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో కొన్ని కంపెనీలతో హౌసింగ్ బోర్డు ఒప్పందాలు చేసుకుని విలువైన భూములు అప్పగించింది. అయితే ప్రాజెక్టు పూర్తయ్యాక, బోర్డుకు రావాల్సిన సొమ్ము చెల్లించకపోవడంతో ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్‌కు హౌసింగ్ బోర్డు నిరాకరిస్తోంది. ఫ్లాట్స్ కొనుగోలుదారులు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, హౌసింగ్ బోర్డుదే తప్పంటూ, ఇందూ ప్రాజెక్టుతో ఉన్న వివాదంతో అమాయకులైన కొనుగోలుదారులను ఇబ్బంది పెట్టొద్దంటూ తీర్పు వెల్లడించింది. అయితే హౌసింగ్ బోర్డు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 4 వారాలలో కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చేసివ్వాలని, డెవలపర్స్‌తో వివాదాలు ఉంటే చట్టప్రకారం తేల్చుకోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.