ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీం కోర్టులో చుక్కెదురు
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో అరెస్టైన ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ కోసం సుప్రీం కోర్టు ఆశ్రయించాడు. అతని తరఫున లాయర్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. జస్టిస్ బెల ఎం. త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రశర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్ ను విచారించింది. అతని బెయిల్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం రిజెక్ట్ చేసింది. దీంతో ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీం నిరాశ తప్పలేదు. కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. అక్టోబర్ 21న పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం తేల్చి చెప్పింది. ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని కోర్టు వ్యాఖ్యానించింది.