సిగ్గు సిగ్గు..సంక్షోభంలో లూటీ
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌ను కార్చిచ్చు కబళిస్తోంది. సంపన్నులతో సందడిగా ఉండే ఆ నగరం నేడు ఎటు చూసినా కాలిపోయిన భవంతులతో దావాగ్ని జ్వాలలతో భయం కలిగిస్తోంది. సందట్లో సడేమియాలా దొంగలు విజృంభిస్తున్నారు. హాలీవుడ్ స్టార్లు, సెలబ్రిటీలు వదిలి వెళ్లిపోయిన ఇళ్లలోకి జొరబడి విలువైన వస్తువులు దోచుకుంటున్నారు దొంగలు. అక్కడి అధికారులు ఇలాంటి వారు సిగ్గు పడాలని, సంక్షోభ సమయంలో ప్రజలను దోచుకునేవారు తగిన పరిణామాలు అనుభవిస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 20 మంది లూటర్లను అరెస్టు చేశారు. గస్తీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 6గురు మరణించారు. అమెరికా చరిత్రలోనే అత్యధికంగా రూ.12 లక్షల కోట్లు నష్టం వచ్చిందని అంచనా వేశారు. అక్కడి బీమా సంస్థలకు కూడా 20 బిలియన్ డాలర్ల వరకూ నష్టం వాటిల్లుతోంది. విపరీతంగా వీస్తున్న గాలుల కారణంగా అగ్నిమాపక సిబ్బందికి మంటలు ఆర్పడంలో ఆటంకం కలుగుతోంది. నీరు కూడా ఖాళీ అవుతోందని, సరిపోవడం లేదని వారు పేర్కొంటున్నారు.


 
							 
							