Home Page SliderNational

కర్నాటకలో జోరుగా ఈటల ఎన్నికల ప్రచారం

Share with

సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రాజ్ కుమార్ పాటిల్ తరపున బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కలిసి సులేపేట్‌లో కోలిసమాజ్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. సెడెం నియోజకవర్గం మొదట్లో హైదరాబాద్ సంస్థాన్‌లో ఉండేదని, రెండు ప్రాంతాలు, ఇరుగు పొరుగుగా ఉన్నాయన్నారు. రెండు ప్రాంతాల సాంప్రదాయాలు ఒక్కటేనన్నారు. కర్నాటకలోనే కాదు తెలంగాణలో కూడా గెలిచేది బీజేపీనే అన్నారు.

10 ఏళ్లుగా తెలంగాణలో డబ్బు, దౌర్జన్యంతో పాలన సాగుతోందన్నారు. ఆత్మగౌరవం కుంటుబడుతోందన్నారు. బీజేపీనీ గెలిపించి కుటుంబపాలనకు అంతం చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. కర్నాటకలో 10వ తేదీన గతంలోలా ఈ సారి కూడా బీజేపీని గెలిపించాలన్నారు. వ్యవసాయం సరిగా లేక కందులు, జొన్నలకే పరిమితం అయిన రైతులకు.. కాగ్నా నది మీద చెక్ డ్యాం నిర్మాణం జరుగుతోందని, ఈ ప్రాంతం సస్యశ్యామలం కాబోతుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి వేగవంతం కానుందన్నారు.

కాంగ్రెస్ 50 ఏళ్లు పాలించినా ఒరిగింది ఏమీ లేదన్నారు. ఎస్సీ 15 %  రిజర్వేషన్ నుండి జనాభా ప్రకారం 17% రిజర్వేషన్లు, ట్రైబల్ 3 % నుండి 7 % బీజేపీ పెంచిందన్నారు. ముదిరాజ్ సమాజ్, కోలి సమాజ్, 60 లక్షల జనాభా ఉందన్నారు. వారు బీసీ ఏ నుండి ఎస్సీ లేదా ఎస్టీ లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారని, అది చేయగలిగే సత్తా ఒక్క బీజేపీకే మాత్రమే ఉందన్నారు. నరేంద్ర మోదీ పాలనలో భారత కీర్తి పతాక ప్రపంచ పటం మీద ఎరుగుతోందన్నారు. దేశంలో ఇప్పుడు స్కాంలు లేవన్న ఈటల, భారత్‌ను విశ్వగురు చేయడమే ప్రధాని లక్ష్యమన్నారు. పువ్వు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు. రాజ్ కుమార్ పాటిల్‌ను గెలిపించాలని ఈటల పిలుపునిచ్చారు.